బాబువన్నీ అవకాశవాద విధానాలే | Suravaram Sudhakar Reddy speech at Left parties Maha Garjana | Sakshi
Sakshi News home page

బాబువన్నీ అవకాశవాద విధానాలే

Sep 16 2018 5:04 AM | Updated on Sep 16 2018 5:04 AM

సీపీఐ, సీపీఐ(ఎం) మహాగర్జన సభలో మాట్లాడుతున్న  సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి   - Sakshi

సాక్షి, అమరావతి: నాలుగేళ్లు బీజేపీతో అంటకాగిన చంద్రబాబు రాష్ట్రానికి ఎందుకు ప్రత్యేక హోదా సాధించలేకపోయారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రజాగ్రహం పెరగడంతో బీజేపీపై నెపం నెట్టి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి పోరాడుతున్నట్టు చంద్రబాబు బిల్డప్‌ ఇస్తున్నారని సురవరం ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ఉభయ కమ్యూనిస్టు పార్టీలు విజయవాడలో శనివారం ‘మహాగర్జన’ బహిరంగ సభ నిర్వహించాయి. సభలో సురవరం మాట్లాడుతూ చంద్రబాబువి మొదటి నుంచి అవకాశ విధానాలేనన్నారు. నాలుగేళ్లుగా నిరుద్యోగభృతి గురించి పట్టించుకోని బాబు మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తుండటంతో ఇప్పుడు యువనేస్తం ప్రారంభించి ఏదో చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.

రాయలసీమలో కరువును జయించినట్టు చెబుతున్న చంద్రబాబు నీటి బొట్టును ఒడిసిపట్టడం మర్చిపోయి రాష్ట్రం అంతటా ఇసుక రేణువులను ఒడిసిపట్టి పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏపీ రాజకీయ చరిత్రలో ఈ మహాగర్జన నూతన అధ్యాయాన్ని సృష్టించాలని అభిలాషించారు. మతతత్వ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ మాట్లాడుతూ మోదీపై చంద్రబాబు లాలూచీ కుస్తీ నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. ఏపీలో చంద్రబాబు తమ్ముడు అయితే ఆయనకు ఢిల్లీలో మోదీ పెద్దన్న అని, వారిద్దరు ఒకే విధానాలు అమలు చేస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబును ఏమాత్రం నమ్మొద్దని, మోదీకి వ్యతిరేకంగా ఆయనకు పోరాడే శక్తిలేదని చెప్పారు. దేశంలో ప్రజల జేబులు కొట్టే ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం దిగిపోవాలంటే వామపక్ష శక్తులు మరింత బలపడాలన్నారు. దేశాన్ని రక్షిద్దాం, మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం అనే అజెండాతో ముందుకుసాగాలన్నారు. ‘మోదీ పోవాలి.. బాబు పోవాలి’ అనే ఒకే ఒక నినాదంతో వామపక్ష లౌకిక శక్తులు ముందుకు సాగాలని కోరారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో మాఫియాల రాజ్యం, రౌడీరాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడుతున్నాయని, ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ అబద్ధాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతి, లంచగొండి రాజ్యంగా మార్చేశారని ధ్వజమెత్తారు. సభలో జనసేన రాష్ట్ర కన్వీనర్‌ చింతల పార్థసారధి, వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షుడు తిరుమావలవన్, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి బి.బంగారావ్, పార్వర్డ్‌ బ్లాక్‌ రాష్ట్ర కార్యదర్శి పీవీ సుందరరామరాజు, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, ఎంసీపీఐ(యు) రాష్ట్ర సహాయ కార్యదర్శి తుమాటి శివయ్య, అమ్‌ఆద్మీ రాష్ట్ర కన్వీనర్‌ పోతిన వెంకటరామారావు, సీపీఎం భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్, పలువురు వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు మాట్లాడారు.

ఎరుపెక్కిన బెజవాడ..
విజయవాడలో నిర్వహించిన వామపక్ష మహాగర్జనకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఎర్ర దళంతో బెజవాడ ఎరుపెక్కింది. రైల్వే స్టేషన్‌ నుంచి సీపీఐ ఆధ్వర్యంలో ఒక ర్యాలీ, రామవరప్పాడు నుంచి సీపీఎం ఆధ్వర్యంలో మరో ర్యాలీ, బీఆర్‌టీఎస్‌ రోడ్డులోని సభా ప్రాంగణానికి చేరుకున్నాయి. ఎర్ర జెండాలు, ఎర్ర చొక్కాలతో కవాతు నిర్వహించడంతో ఆ ప్రాంతం అంతా ఎరుపుమయం అయ్యింది. ప్రజానాట్యమండలి కళాకారులు అభ్యుదల గీతాలతోపాటు నృత్యప్రదర్శలు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement