ఆర్‌ఎస్‌ఎస్‌కే ప్రధానిగా మోదీ: సురవరం

Suravaram sudhakar reddy commented over modi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశానికి కాకుండా కేవలం ఆర్‌ఎస్‌ఎస్‌కే ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్నారని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం ఇక్కడ పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానానికి భయపడిన మోదీ పార్లమెంటును వాయిదా వేసుకున్నారని విమర్శించారు. ఎన్డీయేలో భాగస్వామ్యపక్షాలతో కూడా చర్చించి ప్రత్యేక హోదా సమస్యను పరిష్కరించలేని అసమర్థత కేంద్రానిదని విమర్శించారు.

ఎన్డీయే పక్షాలను విశ్వాసంలోకి తీసుకోకుండా కేవలం ఆర్‌ఎస్‌ఎస్‌కే ప్రధాని అన్నట్టుగా మోదీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం, వారి విధానాల పట్ల దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయన్నారు. హక్కుల కోసం ఆందోళనలు చేస్తున్న దళితులపై కాల్పులు జరపడం బాధాకరమన్నారు. ‘అంబేడ్కర్‌ను పూజించు, దళితులను చంపించు’అనే నినాదంతో బీజేపీ వాళ్లు పనిచేస్తున్నారని నారాయణ ఆరోపించారు.

ఇన్నాళ్లు బీజేపీ మోచేతి నీళ్లు తాగిన టీడీపీ వాళ్లు కూడా నిరసన చెబుతున్నారని అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు పోరాడుతున్నందుకే, టీడీపీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో నిరసనకు దిగుతోందని నారాయణ అన్నారు. ప్రత్యేకహోదా గురించి పోరాటం చేసిన సీపీఐ కార్యకర్తలపై కేసులు బనాయించి జైల్లో పెడున్నారని, దీనికి ఏపీ సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీపై సీఎం కేసీఆర్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు.

కోదండరాం పార్టీ జనసమితిపై నోటికొచ్చినట్టుగా మాట్లాడటం సరికాదని, కోదండరాం పార్టీ పెట్టడంతో సీఎం కేసీఆర్‌ భయపడుతున్నారన్నారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాలకు రావాల్సిన నిధుల విషయంలో ఇరు రాష్ట్రాల  సీఎంల తీరు సరిగా లేదన్నారు. విభజన బిల్లు ఇచ్చిన ఒక్క హామీని కేంద్రం నెరవేర్చలేదన్నారు. ఈ నెల 26న రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన తెలుపుతామని ప్రకటించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top