జగన్‌తోనే  మైనార్టీలకు సంక్షేమ ఫలాలు 

Special Interview With Kurnool YCP Candidate Hafeezkhan - Sakshi

సాక్షి, కర్నూలు  :  ‘నాకు డబ్బు సంపాదించాలన్న వ్యామోహం లేదు. సేవ చేయాలనే తలంపుతోనే రాజకీయాల్లోకి వచ్చా. కర్నూలు నగర ప్రజల సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదులుకుని రాజకీయాల్లో చేరాను. ఇక్కడి సమస్యలపై తొమ్మిదేళ్లు అవగాహన పెంచుకున్నాను. నగర ప్రజల అవసరాలేంటి, వారికేం కావాలో ఇప్పుడు నాకు పూర్తిగా తెలుసు. అవన్నీ నా మదిలో ఉన్నాయి.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి చేరిన నేను ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలి.. వాటిని ఎలా పరిష్కారించాలనేది క్షేత్ర స్థాయికి వెళ్లి అవగాహన పెంచుకున్నాను. కర్నూలు అసెంబ్లీ సీటు గెలిచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా ఇస్తా’ అంటున్నారు వైఎస్సార్‌సీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి హఫీజ్‌ఖాన్‌. ‘సాక్షి’తో తన అంతరంగాన్ని పంచుకున్నారు.  

‘మైనార్టీ వర్గానికి చెందిన నాలాంటి వ్యక్తికి సీటు రావడమే తొలి విజయం. నేను ప్రాథమిక విద్యాభ్యాసాన్ని కర్నూలు మాంటిస్సోరి, ఇంటర్మీడియెట్‌ ఉస్మానియాలో, సివిల్‌ ఇంజినీరింగ్‌ హైదరాబాద్‌లోని ఎంజే కాలేజీలో పూర్తి చేశా. తరువాత అమెరికా వెళ్లాను. డెట్రాయిట్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ చేశాను. అక్కడే సాఫ్ట్‌వేర్‌ సంస్థను స్థాపించి నిర్వహించాను.

2011లో కర్నూలు తిరిగొచ్చా. మా నాన్నను వైఎస్సార్‌ సీపీలో చేర్పించాలని ఓదార్పు యాత్రలో భాగంగా తెర్నేకల్‌కు వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశాను. అప్పుడే రాజకీయాల్లోకి రావాలని జగనన్న కోరితే కాదనలేకపోయా. అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయా. పార్టీలో సామాన్య కార్యకర్తగా నా ప్రస్థానం ప్రారంభమైంది. నా సేవలను గుర్తించిన వైఎస్‌ జగన్‌ కర్నూలు అసెంబ్లీ సీటిచ్చారు. ఇదే నా తొలి విజయం.  

వైఎస్‌ హయాంలోనే మైనార్టీల సంక్షేమం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మైనార్టీలకు ఆరాధ్య దైవం. ఆయన ముస్లిం, మైనార్టీల్లో వెనుకబడిన పేద కుటుంబాలను ఆదుకునేందుకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ,, పేద మహిళల పెళ్లిళ్లకు ప్రోత్సాహం వంటి అనేక పథకాలు ప్రవేశపెట్టారు. వీటితో ఎంతోమంది పేద ముస్లింలు బాగుపడ్డారు. ఆయన మరణం తరువాత మైనార్టీలను పట్టించుకునే నాథుడే కరువయ్యారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే ముస్లింలకు మళ్లీ సంక్షేమ ఫలాలు అందుతాయి. నవరత్నాల వల్ల ముస్లింల అభివృద్ధి మళ్లీ పట్టాలెక్కుతుంది. కర్నూలు నగరంలో ఎక్కువగా ముస్లింలు ఉన్నారు. అందులో పేదల శాతం ఎక్కువ. ఇక్కడ వారికి ఉద్యోగ అవకాశాలు లేవు. ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. అలా వెళ్లేవారికి ఇక్కడే ఉద్యోగావకాశాలు కల్పించాలన్నదే నా ధ్యేయం. కర్నూలు–నంద్యాల మధ్య పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటు చేసేందుకు వైఎస్సార్‌ సీపీ సానుకూలంగా ఉంది.

అదే జరిగితే కర్నూలు జిల్లా నిరుద్యోగులకు ఎంతో ఉపయోగం కలుగుతుంది.  వారిపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు కర్నూలు నగరం విభిన్న కులాల సమాహారం. ఇక్కడ ముస్లింలు, ఆర్యవైశ్యులు, రెడ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు రాజస్థానీయులు జీవిస్తున్నారు. బడా వ్యాపారవేత్త టీజీ వెంకటేష్‌ కుటుంబం వారిని ఇబ్బంది పెడుతోంది. అన్ని వ్యాపారాలు వాళ్లే చేయాలనుకుంటున్నారు.

వాళ్లు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేశారు. జీవనం కోసం కష్టపడే వారిని నష్టాలకు గురి చేస్తూ అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు. అలాంటి నాయకులపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వారి పాలనను ప్రజలు కోరుకోవడం లేదు. వారికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.  

విజయానికి ఢోకా లేదు 
కర్నూలు నగరంలో వైఎస్సార్‌ సీపీకి కార్యకర్తల బలం అధికంగా ఉంది. టీజీ కుటుంబం డబ్బుతో ఓట్లను కొనుగోలు  చేయాలని చూస్తోంది. మా పార్టీలో అమ్ముడుపోయే కార్యకర్తలు లేరు. కొందరు రాజకీయమంటే వ్యాపారంగా చూస్తున్నారు. అది తప్పు. రాజకీయమంటే పేదలకు సేవ చేయడం. సంపాదన కోసం మాత్రం కాదు.  

కర్నూలును స్మార్ట్‌ సిటీగా మారుస్తా
కర్నూలు నగరంలో దాదాపు 6 లక్షల జనాభా ఉంది. ఇక్కడి ప్రజలకు మంచి నీళ్లు అందడం లేదు. ఫిబ్రవరి నుంచే నీటి ఎద్దడి ఉంటోంది. దీని కోసం రెండో సమ్మర్‌ స్టోరేజి ట్యాంకు కట్టేందుకు వైఎస్‌ హయాంలో నిధులిచ్చినా వెనక్కిపోయాయి. హంద్రీ, తుంగభద్ర నదుల రక్షణ గోడ నిర్మాణానికి పెద్దాయన నిధులిచ్చినా తరువాత వచ్చిన పాలకులు కట్టలేకపోయారు.

నగరంలో ఎక్కడా డ్రెయినేజీలు లేవు. ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా ఉంది. ఇన్నర్, అవుటర్‌ రింగ్‌రోడ్ల నిర్మాణం చేపట్టాలి. నగరాన్ని దోమల బెడద నుంచి కాపాడాల్సి ఉంది. యువతకు ఉద్యోగాలు కావాలి. వీటన్నింటినీ సాధించి కర్నూలు నగరాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాయంతో స్మార్ట్‌ సిటీగా మారుస్తా. ఐదేళ్ల టీడీపీ పాలనలో స్మార్ట్‌ సిటీ అంటూ హడావుడి చేసి అభివృద్ధి చేయలేకపోయారు. గ్రూపు రాజకీయాలు, వర్గ విభేదాలతో కర్నూలు అభివృద్ధి కుంటుపడింది .   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top