పొలిటికల్‌ రింగ్‌లో విజేందర్‌ ఘోర ఓటమి

Ramesh Bidhuri Gest Big Victory, Vijender Singh Loses - Sakshi

ఢిల్లీ: తన ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ కెరీర్‌లో తిరుగులేని ఆధిక్యంలో కొనసాగుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజేందర్‌ సింగ్‌.. పొలిటికల్‌ రింగ్‌లో మాత్రం ఘోర ఓటమి చవిచూశారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో నిలిచిన విజేందర్‌ సింగ్‌ ఎటువంటి పోటీ ఇవ్వకుండా పరాజయం పాలయ్యారు. దక్షిణ ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి దిగిన విజేందర్‌ మూడో స్థానానికే పరిమితమయ్యారు. కేవలం లక్షా అరవై నాలుగు వేల నూట యాభై ఎనిమిది ఓట్లకు మాత్రమే పరిమితమైన విజేందర్‌ సింగ్‌ ప్రత్యర్థులకు కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. ఇక్కడ దక్షిణ ఢిల్లీ నుంచి బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ రమేష్ బిధూరీ ఘన విజయం సాధించారు.  రమేష్‌ బిధూరీ 6, 83, 578 ఓట్లు సాధిస్తే, ఆప్‌ నుంచి పోటీ చేసిన రాఘవ్‌ చాధా 3,18, 584 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 

దక్షిణ ఢిల్లీ స్థానం హర్యానాకు ఆనుకొని ఉండటంతో జాట్లు, గుర్జర్ సామాజిక వర్గాల ఓటర్లను విజేందర్ తనవైపు తిప్పుకోగలడని భావించిన కాంగ్రెస్ ఈ సీటును అతనికి కేటాయించింది. ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి ఓటమి ఎరుగకుండా విజేందర్‌ తనదైన మార్కును చూపెట్టారు. వరుసగా పది బాక్సింగ్‌ ఫైట్లలో విజయం సాధించడం ద్వారా తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఇందులో 7 విజయాల్ని నాకౌట్‌ రూపంలో సాధించడం విశేషం. 2008 బీజింగ్‌ ఒలింపిక్‌లో కాంస్య పతకం సాధించిన విజేందర్‌కు హర్యాన ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగంతో సత్కరించింది. రాజకీయాల్లోకి రావడంతో ఆయన తన డీఎస్పీ పదవికి కూడా రాజీనామా చేశారు. 

 2010లో పద్మశ్రీ అవార్డును అందుకున్న విజేందర్‌... 2014లో బాలీవుడ్‌లో నటుడిగా అరంగేట్రం చేశారు. ఫగ్లీ సినిమా ద్వారా వెండితెరకు ఈ బాక్సర్‌ పరిచయయమ్యారు. అక్షయ్‌ కుమార్‌, అశ్విని యార్డిల సొంత ప్రొడక్షన్‌ గ్రేజింగ్‌ గోట్‌ ప్రొడక్షన్‌లో తెరకెక్కిన ఆ చిత్రం యావరేజ్‌ టాక్‌ను మాత్రమే సొంతం చేసుకుంది.  ఇక 2015 అక్టోబర్‌లో తన ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ కెరీర్‌ను ప్రారంభించారు. ఒలింపిక్స్‌ పతకం సాధించిన తొలి భారత బాక్సర్‌గా నిలిచిన విజేందర్‌.. తాజాగా రాజకీయ పంచ్‌ విసురుదామనుకుని బరిలోకి దిగినప్పటికీ ఆయన ఆశలు ఫలించలేదు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top