మంత్రి ప్రత్తిపాటి అండతో పేకాట క్లబ్‌లు | Sakshi
Sakshi News home page

మంత్రి ప్రత్తిపాటి అండతో పేకాట క్లబ్‌లు

Published Wed, Feb 7 2018 9:42 AM

prathipati pulla rao supports cards clubs - Sakshi

చిలకలూరిపేట టౌన్‌: జిల్లాలోని చిలకలూరిపేటలో పౌర సరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున కోతముక్క నిర్వహిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్‌ ఆరోపించారు. మంగళవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెద్దల కాలక్షేపం కోసం నిర్మించిన సీఆర్‌ రిక్రియేషన్‌ క్లబ్‌ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరి, గురజాల క్లబ్‌లను మూయించి, పేటలో పేకాట నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రోజుకు రూ.2 కోట్లకుపైగా కోత ముక్కాటలో చేతులు మారుతున్నాయని, దీంతో క్లబ్‌కి రూ.2 లక్షలకుపైగా ఆదాయం లభిస్తుందని తెలిపారు.

నల్లధనానని తెల్లధనంగా మార్చుకునేందుకు మంత్రి స్వర్ణాంధ్ర ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి క్లబ్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని సేవల పేరుతో దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. గతంలో కరెంట్‌ బిల్లు చెల్లిండానికే క్లబ్‌కి ఆదాయం ఉండేది కాదని, నేడు ఏటా రూ.10 కోట్ల విరాళాలు ఇచ్చేలా అసాంఘిక కార్యకలాపాలు నడుపుతున్నారనివిమర్శించారు. మద్యం దుకాణాలు, జాదం నిర్వహించడం ద్వారా వచ్చే ఆదాయంతో వైద్య శిబిరాలు, ఎడ్ల పందేలు నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ఇక్కడకు చేరుకుంటున్న జాదరులు మంత్రి అండతో యథేచ్ఛగా ఆడుతున్నారని పేచర్కొన్నారు. క్లబ్‌ ఆదాయ వనరులు, వాటి వివరాల లెక్కలు తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట పార్టీ పట్టణాధ్యక్షుడు ఏవీఎం సుభాని ఉన్నారు.

Advertisement
Advertisement