విపక్షాలన్నీ కకావికలం

Post Lok Sabha Elections, Opposition Falling Apart - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీ పార్టీ 303 సీట్లతో అఖండ విజయం సాధించడంతో షాక్‌కు గురైన ప్రతిపక్ష పార్టీలు ఈ పాటికి తేరుకొని పార్లమెంటులో నిర్ణయాత్మక పాత్రను పోషించాల్సిందిపోయి ఇంకా కకావికలం అవుతున్నాయి. ఇతర విపక్షాలను సమీకరించాల్సిన కాంగ్రెస్‌ పార్టీయే నాయకత్వ సంక్షోభంలో కూరుకుపోయింది. యూపీలో కలసికట్టుగా పోటీ చేసిన ఎస్పీ–బీఎస్పీ కూటమి నుంచి బీఎస్పీ విడిపోయింది. ఒక్క ఎస్పీతోనేగాదని, ఏ పార్టీతోని భవిష్యత్తులో ఎలాంటి పొత్తులు పెట్టుకునే ప్రసక్తే లేదని మాయావతి స్పష్టం చేశారు.

పార్లమెంటులోనైనా బీజేపీని సమైక్యంగా ఎదుర్కొందాం, రారండోయ్‌ అంటూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇచ్చిన పిలుపును కాంగ్రెస్, వామపక్షాలు తిరస్కరించాయి. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి కుస్తీ పడుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, అసహనంతో ఓటర్లను దూషిస్తున్నారు. ‘ఓట్లేమో బీజేపీకి వేస్తారు. పనులేమో నేను చేసిపెట్టాలా ?’ అంటూ ఇటీవల ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక బిహార్‌లో ‘మహాఘట్‌బంధన్‌’కు నాయకత్వం వహించిన తేజశ్వి యాదవ్‌ ఫలితాల అనంతరం పత్తాలేకుండాపోయి శనివారం నాడు ట్విటర్‌ ద్వారా జనంలోకి వచ్చారు. బిహార్‌లో ఎన్‌సెఫలైటిస్‌ వల్ల 150 మంది పిల్లలు మరణించడం వల్ల రాలేకపోవడం ఒక కారణమైతే కాలుకు శస్త్ర చికిత్స చేయించుకోవడం వల్ల విశ్రాంతి తీసుకోవాల్సిరావడం మరో కారణమని ఆయన పేర్కొన్నారు.

ఇక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ కేంద్రంలోని బీజేపీకే కొమ్ముకాస్తోంది. గత కొంతకాలంగా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి లంకా దినకర్‌ సహా నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిపోయారు. జూలై 5వ తేదీ నుంచి జరుగనున్న బడ్జెట్‌ పార్లమెంట్‌ సమావేశాల్లో నిర్ణయాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించేందుకు విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉంది. అలా జరక్కపోతే 12 లోక్‌సభ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికలు, 2022లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు మొన్నటికంటే చేదు ఫలితాలను చవి చూడాల్సి వస్తుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top