అహంకారంతోనే అసెంబ్లీ రద్దు: పొన్నం 

Ponnam Prabhakar fires on KCR and Harish Rao - Sakshi

వర్గల్‌(గజ్వేల్‌): బహిరంగ సభల్లో కేసీఆర్, హరీశ్‌లు చెప్పే మాటలన్నీ అబద్దాలేనని, అహంకార పూరితంగా తీసుకున్న అసెంబ్లీ రద్దు నిర్ణయంతో ప్రజలకు కేసీఆర్‌ నియంత పాలన పీడ విరగడైందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శుక్రవారం ఆయన సిద్దిపేట జిల్లా వర్గల్‌లో విలేకరులతో మాట్లాడుతూ, ముందస్తుకు కాలుదువ్విన కేసీఆర్‌కు పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన పార్టీలు చరిత్రలో గెలిచిన దాఖలాలు లేవని, కేసీఆర్‌కు కూడా అదే గతి పడుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖరారైపోయిందన్నారు.

అసెంబ్లీ రద్దు నిర్ణయంపై కేసీఆర్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. హుస్నాబాద్‌ ప్రాంతంలో గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్‌ ద్వారా లక్షాయాభై వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వకపోతే మెడకోసుకుంటానని చెప్పిన కేసీఆర్‌.. ఇప్పుడు ఏ ముఖంతో అక్కడ ఓట్లడిగేందుకు ఆశీర్వాద సభ పెట్టారని ఎద్దేవా చేశారు. హుస్నాబాద్‌లో మొదటి మీటింగ్, సెంటిమెంట్‌.., లక్కీ నియోజకవర్గం అని ఇపుడు కేసీఆర్‌ అంటున్నారని, గత ఎన్నికలలో మాత్రం హుస్నాబాద్‌ సభకు ముందే జోగిపేట, కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్‌లలో సభలు పెట్టినట్లు పొన్నం పేర్కొన్నారు. భగీరథ నీళ్లు ఇంకా రాలేదని, ఉద్యోగాల జాడ లేదని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా బెదిరింపులు, దాటవేత ధోరణే కేసీఆర్‌ నిజ స్వరూపమన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top