తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌

Polling Ends In Telangana Assembly Elections - Sakshi

ఈవీఎంలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం

అందరి దృష్టి డిసెంబర్‌ 11న ఫలితాలపైనే

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. చెదురు మదురు ఘటనలు మినహా మొత్తం 119 నియోజకవర్గాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 5 గంటలలోపు క్యూలో ఉన్నవారికి ఓటేయడానికి అనుమతినిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పెద్దసంఖ్యలో ఓటు వేయగా.. హైదరాబాద్‌ నగరంలో మాత్రం ఓటర్లు ఎప్పటిలాగే నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. దీంతో నగరంలోని చాలా నియోజకవర్గాల్లో అతి తక్కువ పోలింగ్‌ శాతం నమోదైంది. చంద్రాయణగుట్ట, నాంపల్లి నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటింగ్‌పై అంతగా ఆసక్తి చూపకపోవడంతో పోలింగ్‌ బూత్‌లు బోసిపోయి కనిపించాయి. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తం కాగా.. ఈ నెల 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపై నెలకొంది. 

కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌ రెడ్డిపై దాడి..
మహబూబ్‌నగర్‌ జిల్లా ఆమనగల్లు మండలం, జంగారెడ్డిపల్లిలో కల్వకుర్తి కాంగ్రెస్‌ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన ప్రయాణిస్తున్న కారు అద్దాలు పగిలిపోయాయి. గాయపడిన ఆయనను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ సంఘటనతో జంగారెడ్డిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా సకాలంలో స్పందించిన పోలీసులు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడ్డారు. మిగతా నియోజకవర్గాల్లో కూడా అక్కడక్కడా చెదురు మదురు ఘటనలు చోటుచేసుకున్నా.. పోలీసులు అదుపు చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top