పొలిటికల్‌ మంటపై  ఎన్నికల వంట! 

Political Satirical Story On Political Parties Manifesto In Andhra Pradesh - Sakshi

నయాసీన్‌

‘‘ఎలక్షన్లకూ, వంటలకూ బాగా దగ్గరి సంబంధం ఉందని నా అభిప్రాయం రా’’ అన్నాడు మా రాంబాబుగాడు.  
‘‘నువ్వెప్పుడూ ఇంతేరా. నువ్వనేదాన్లో ఏమైనా లాజిక్‌ ఉందా? అసలు ఎన్నికలకూ, వంట వండటానికీ ఎలా ముడిపెట్టగలుగుతున్నావ్‌’’ అంటూ కోప్పడ్డాను నేను.  
‘‘విను.. ఉదాహరణకు మన చంద్రబాబు ఉన్నాడనుకుందాం. ‘మీకు పోలవరం బిర్యానీ పెడతా.. రాజధాని బగారాబైగన్‌ రెసిపీ చేస్తా’ అంటూ తెగ ఊరిస్తూ ఉంటాడు. కానీ ఐదేళ్ల పాటు ఏమీ చేయడు. ఉన్న టైమ్‌లో ఏమీ చేయలేక ‘నేను విదేశాలన్నీ తిరిగి రకరకాల కాంటినెంటల్‌ ఐటమ్స్‌తో, మీకు ఇంటర్నేషనల్‌ క్యూజిన్‌ వడ్డిద్దామనుకున్నాను.
కానీ కేంద్రంలో మోదీ, పక్కరాష్ట్రంలో కేసీఆర్‌ అడ్డుపడటం వల్ల ఏమీ చేయలేకపోయాను. ఈసారికి ఇవే తినండి’ అంటూ పాత మేనిఫెస్టో మెనూలో మిగిలిపోయిన అన్నంలో ఏ తాలింపో, పోపో వేసేసి పోపన్నం చేస్తాడు.
అలా పొద్దున్నే పాచి ఐటమ్స్‌తోనే మేకోవర్‌ తిరగమోతతో మేనేజ్‌ చేస్తూ మోత మోగించేస్తుంటాడు. ఆ పాచిబువ్వ పులిహోర కలిపేస్తున్నప్పుడు వచ్చే పోపు వాసనను పట్టుకొని, ఎల్లో మీడియా అంతా ‘వాహ్‌.. వాటే వాసన... ఇట్స్‌ గోయింగ్‌ టు బీ డెలీషియస్‌ డిషెస్‌’ అంటూ హడావుడి చేస్తూ ఊదరగొట్టేస్తుంది.  
‘‘కరక్టేరా.. నువ్వంటుంటే నిజమే అనిపిస్తోంది’’ అన్నాను.  
‘‘అప్పుడే అయిపోయిందా.. విను. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ల వంటలన్నీ మాటల రెసిపీల లాంటివే. ఉదాహరణకు చంద్రబాబు తెలంగాణలో పోటీ చేయాలనుకున్నప్పుడు ‘నేను తెలంగాణ కోసం లేఖ ఇచ్చా. తెలంగాణకు నేను వ్యతిరేకం కాదు’ అంటూ ‘రెండు డిష్‌’ల సిద్ధాంతం చెబుతాడు. అలాగే ఈ చంద్రబాబు కనుసన్నల్లో, అడుగుజాడల్లో నడుస్తున్న పవన్‌కళ్యాణ్‌ కూడా ఆయన దారిలోనే మరింత ముందుకెళ్లి.. ఆంధ్రలో మాట్లాడేటప్పుడు ‘తెలంగాణలో ఆంధ్రవాళ్లను కొడుతున్నారటాడు.
మళ్లీ కాసేపటికి తెలంగాణకు వచ్చి.. ‘నేను తెలంగాణలో పుట్టకపోవడం నా దురదృష్టం. నేనిక్కడే పుట్టి ఉద్యమంలో ఉండి ఉంటే.. దుర్మార్గులైన ఆ యొక్క ఆంధ్రనాయకులను అల్లల్లాడించి, వాళ్లను అష్టకష్టాలు పెట్టేవాణ్ణి. మిమ్మల్ని కష్టాలే లేకుండా కళ్లలో పెట్టుకునేవాణ్ణి’ అని వాపోతాడు. ఇదెలాంటిదంటే.. పెనం మీద పిండి పరచి దోసె వేశాక.. అవతలివైపు కూడా బాగా కాలడానికి దోసె తిరగేయడం లాంటిదన్నమాట. ఇలా దోసెల్లాగా, చపాతీల్లాగా రెండువైపులా మాటిమాటికీ తిరగేస్తున్నట్టుంటాయి వీళ్ల పొలిటికల్‌ ప్రసంగాలు. వీళ్లలోనే మరికొందరుంటారు. వారు పొత్తులనే పేరుతో నలుగురైదుగురు కలిసి వంట చేస్తుంటారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అయితే పొత్తులేదంటూనే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, పాల్‌ లాంటివాళ్లు కలిసి.. అన్నం లాంటి ఒకే ఐటమ్‌ను ఒకరు బగారరైస్‌ అనీ, మరొకరు బిర్యానీ అనీ, ఇంకొకరు ఫ్రైడ్‌ రైస్‌ అని వండుతున్నారు. ‘టూ మెనీ కుక్స్‌ స్పాయిల్‌ ద బ్రాత్‌’ అనే సామెత తెలుసుకదా. అయితే వీరందరూ కలిసి పక్కవాళ్ల వంటను చెడగొట్టేందుకు ప్రయత్నిస్తుంటారు’’ చెప్పాడు రాంబాబుగాడు.  
‘‘మరి వీళ్లలో ఎవరైనా సిన్సియర్‌గా కడుపు నింపేవారు ఉన్నారంటావా?’’ నేనడిగా.  
‘‘ఉన్నారు. ఆయన షో చేయడు. అప్పటికప్పుడు ఏదో వండేస్తున్నట్టు నటించడు. చాలా ముందు నుంచే పొయ్యిసెగలాంటి ఎండలో మాడుతూ, నడుస్తూ అందర్నీ కలుస్తాడు. మర్నాటి ఇడ్లీ కోసం ముందు రోజు నుంచే పిండి కలుపుకొన్నట్టు ఎప్పట్నుంచో శ్రమ పడతారు. ఆ ఇడ్లీలోకి కొబ్బరిపచ్చడీ, అల్లంచెట్నీ, సాంబారు.. ఇలాంటివెన్నో టిఫిన్‌గా పెడతామంటాడు. వాటికి అవసరమైన సరుకుల కోసం ముందు నుంచే పాదాల మీద శ్రమతో నడుస్తూ.. చాలా చోట్ల తిరుగుతూ, అన్ని రకాల సంభారాలూ సేకరిస్తారు.
నవరత్నాల్లాంటి పిండి వంటలు చేస్తాననీ, ఆ వంటకయ్యే దినుసులూ చూపిస్తారు. మధ్యాహ్న భోజనం కోసం, రాత్రి ఫుడ్‌ కోసం  తానేమి వండిపెట్టదలచుకున్నాడో అవే తప్పకుండా వండుతాడు. అలాంటి యువనేతలాంటి చెఫ్‌ను నమ్ముకుంటేనే ముప్పూటలా కడుపునిండుతుంది. షడ్రసోపేతమైన విందు దొరుకుతుంది’’ అంటూ ముగించాడు మా రాంబాబుగాడు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top