హరియాణాలో డేరా రాజకీయం

political parties keen to take the spiritual path in Haryana - Sakshi

హరియాణా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అన్ని ప్రధాన పార్టీలు ఆధ్యాత్మిక బాట పట్టాయి. డేరాలు, బాబాల చుట్టూ తిరుగుతూ మద్దతు కోసం పోటీ పడుతున్నాయి. హరియాణాలో ఆధ్మాత్మిక సంస్థల ప్రభావం ఓటర్లపై విపరీతంగా ఉంటుంది. తమ ఆ«ధ్యాత్మిక గురువులు ఏ పార్టీకి ఓటు వెయ్యమని చెబితే వారికే గుడ్డిగా ఓటు వేసే అనుచరగణం అధిక సంఖ్యలోనే ఉంది. అందుకే రాజకీయాలన్నీ డేరాల చుట్టూ తిరుగుతున్నాయి.  

డేరా సచ్చా సౌదా గురువు: గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌  
అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలి జైల్లో ఊచలు లెక్కపెడుతున్న గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ ఈ సారి ఏ పార్టీకి మద్దతివ్వాలో ఇంకా నిర్ణయించుకోలేదు. ఈ డేరాలో 15 మంది సభ్యులతో కూడిన ఒక రాజకీయ వ్యవహారాల కమిటీ రాష్ట్రవ్యాప్తంగా సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ సమావేశాల్లో వచ్చే ఫలితాలకనుగుణంగా ఏ పార్టీకి మద్దతివ్వాలో నిర్ణయిస్తామని కమిటీ సభ్యుడు జోగిందర్‌ సింగ్‌ చెప్పారు. డేరా సచ్చా సౌదా ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో నియోజకవర్గాల్లో ఉంది.

సత్‌లోక్‌ ఆశ్రమ్స్‌ గురువు: రామ్‌పాల్‌
ఈ డేరా గురు రామ్‌పాల్‌ కూడా 2014 నవంబర్‌ నుంచే జైల్లో ఉన్నారు. అక్కడి నుంచే ఆయన రాజకీయాలను శాసిస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రామ్‌పాల్‌ కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. కానీ ఈ సారి ఏ పార్టీకి మద్దతివ్వాలో అన్న మీమాంసలో ఉన్నారు. ‘‘లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల అంశాల్లో చాలా తేడా ఉంది. అక్టోబర్‌ 15న సర్వసభ్య సమావేశంలో చర్చించి ఏ పార్టీకి మద్దతునివ్వాలో తేల్చుకుంటాం‘‘అని గురు రామ్‌పాల్‌ డేరా మీడియా ఇన్‌చార్జ్‌ చాంద్‌ రథి వెల్లడించారు. రోహ్తక్‌ చుట్టుపక్కలున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురు రామ్‌పాల్‌ డేరా ప్రభావం ఎక్కువగా ఉంది.

డేరా బాబా శ్రీ బాలక్‌ పురి 
గురువు: కరణ్‌ పురి
ఈ సారి ఎన్నికల్లో కరణ్‌ పురి డేరా ఎన్నికలకు దూరంగా ఉండా లని నిర్ణయించుకుంది. హరియాణా లో నివసిస్తున్నా పంజాబీల్లో అధిక ప్రభావం కలిగిన ఈ డేరా తమ అనుచరులకు ఎలాంటి పిలుపు ఇవ్వడం లేదు. అయితే ఈ డేరాను బీజేపీ నాయకులు అత్యధికంగా సందర్శిస్తున్నారు.

డేరా గౌకరణ్‌ ధామ్‌ 
గురువు: కపిల్‌ పురి  
కాంగ్రెస్‌కు కపిల్‌పురి మద్దతుదారు. కాంగ్రెస్‌ నేత భూపీందర్‌ హూడాకు అనుకూలం. ఈ సారి ఎన్నికల్లో జోక్యం చేసుకోమని చెబుతున్నప్పటికీ బీజేపీకి మద్దతు ఇవ్వాలంటూ గౌకరణ్‌ ధామ్‌ డేరా తమ అనుచరగణానికి సంకేతాలు పంపుతోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top