అందరి చూపు.. బందరు వైపు!

Political Leaders In Bandaru Making Special Arrangements In Hotels For Watching Results2019 - Sakshi

సాక్షి, మచిలీపట్నం: సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపునకు సమయం ఆసన్నమైంది. రాజకీయ పార్టీల నేతలు, ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు పోటీలో ఉన్న అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో బందరు పార్లమెంట్‌ పరిధిలోని 7 అసెంబ్లీ, ఏలూరు పార్లమెంట్‌ పరిధిలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్‌ ప్రక్రియ ఈనెల 23న బందరులోని కృష్ణా యూనివర్సిటీలో జరగనుంది. కౌంటింగ్‌కు ముందురోజే జిల్లా కేంద్రానికి చేరుకోవడానికి అటు అధికారులు, ఇటు సిబ్బంది.. ఇటు అన్ని పార్టీల నేతలు, వారి అనుయాయులు సిద్ధమవుతున్నారు. దీంతో బందరులో వీరి వసతి ఏర్పాట్ల వ్యవహారం పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. అధికారులకు సంబంధించి ఇప్పటికే ఈ ఏర్పాట్లు పూర్తి కాగా.. పార్టీలపరంగా ఎవరికి వారు తమతో వచ్చేవారి కోసం వసతి సౌకర్యానికి మల్లగుల్లాలు పడుతున్నారు. విందు కోసం ఆయా పార్టీల కార్యాలయాలల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. 
లాడ్జీలన్నీ ఫుల్‌!
బందరులో కౌంటింగ్‌ జరగనున్న 9 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు బందరులో ఒక రోజు ముందుగానే మకాం వేసేందుకు సిద్ధం అవుతున్నారు. వీరితో పాటు అనుచరులను సైతం వెంటబెట్టుకుని రానుండటంతో ఏసీ గదులున్న లాడ్జిలు ఏమున్నాయని వెతుకులాటలో కొందరు పడగా.. మరి కొందరు మాత్రం ఇప్పటికే గదులు రిజర్వు చేసుకున్నారు. బందరు పట్టణంలో సుమారు 10 లాడ్జీలు ఉన్నాయి. వాటి పరిధిలో 250 నుంచి 300ల వరకు గదులు అందుబాటులో ఉన్నాయి. రూ.100 నుంచి రూ.5000ల వరకు ధర పలుకుతున్నాయి. అయినా డబ్బుకు ఎవరూ వెనకాడటం లేదు. దీంతో ఈనెల 22, 23వ తేదీల్లో అన్ని లాడ్జిల్లోని గదులన్నీ హౌస్‌ఫుల్‌ అయ్యాయి. 
విందులు.. చిందులు!
ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం తమ అనుచరులకు విందు ఏర్పాటు చేసేందుకు సైతం ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఆయా పార్టీల కార్యాలయాల్లో కొందరు, లాడ్జీల్లో కొందరు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. గెలిచిన అభ్యర్థులను జిల్లా కేంద్రం నుంచి తమ నియోజకవర్గం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. 
లెక్కింపునకు ఏర్పాట్లు.. 
ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో ముఖ్య అధికారులకు ఎన్నికల ఓట్ల లెక్కింపుపై జరిగింది. అంతేగాక అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులకు సైతం శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్‌ ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై వారికి అవగాహన కల్పించారు. నిబంధనలపై ప్రశ్నావళి ఇచ్చి వారి అవగాహన స్థాయిని అంచనా వేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అక్కడి పరిస్థితులను బట్టి కౌంటింగ్‌ టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. పోస్టల్‌ బ్యాలెట్లకు ఒక టేబుల్‌ను కేటాయిస్తున్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top