అమిత్‌షా.. నంబర్‌ 2

PM Narendra Modi rejigs cabinet committees, Amit Shah gets seat in all 8 - Sakshi

నీతి ఆయోగ్‌లోఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా నియామకం

నిర్మలా సీతారామన్‌కు ఏడు కమిటీల్లో స్థానం

రాజ్‌నాథ్‌కు ఆరు కమిటీల్లో చోటు

కేంద్రంలో ప్రధాని మోదీ తర్వాత స్థానం అమిత్‌ షాదేనని ‘సాధికారికం’గా నిరూపణ అయింది. ప్రభుత్వంలో ఆయన అత్యంత శక్తిమంతమైన వ్యక్తి అవుతారన్న రాజకీయ పరిశీలకుల అంచనాలు నిజమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎనిమిది కీలక మంత్రివర్గ సంఘాల్లో (కేబినెట్‌ కమిటీ)నూ అమిత్‌ షా ఉండటమే దీనికి నిదర్శనం. నీతి అయోగ్‌లో ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా కూడా షాను నియమించారు. ఈ కమిటీల్లో కొన్నిటికి మోదీ, మరికొన్నిటికి అమిత్‌షా అధ్యక్షులుగా ఉన్నారు. దీన్నిబట్టి హోం మంత్రి అమిత్‌ షాకు మోదీ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందీ తెలుస్తోంది.

అయితే బుధవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ను కేవలం రెండు కమిటీలకు పరిమితం చేసినప్పటికీ గురువారం మరికొన్ని కమిటీల్లో స్థానం కల్పించింది. పార్లమెంటరీ వ్యవహారాల కమిటీకి అధ్యక్షుడిగా కూడా కేంద్రం నియమించింది. గత ప్రభుత్వంలో ఆరు కమిటీల్లో ఉన్న రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ సారి కూడా ఆరు కమిటీల్లో ఉన్నారు. తాజాగా గురువారం  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఏడు కమిటీల్లో చోటు లభించింది.  గత ప్రభుత్వంలో ఏర్పాటయిన ఆరు మంత్రివర్గ సంఘాలను ఇప్పుడు పునర్‌వ్యవస్థీకరించారు. వీటితో పాటు పెట్టుబడి, ఆర్థిక వృద్ధి, ఉపాధి, నైపుణ్యాభివృద్ధిలపై కొత్తగా రెండు కమిటీలను ఏర్పాటు చేశారు.

సీనియర్‌ ప్రభుత్వాధికారుల నియామకాలు, రాజ్యాంగ సంస్థల ఏర్పాటు వ్యవహారాలు చూసే కేబినెట్‌ కమిటీలో మోదీ, అమిత్‌ షాలు మాత్రమే ఉన్నారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆర్థిక వ్యవహారాలు, భద్రత వ్యవహారాలు, కీలకమైన రాజకీయ వ్యవహారాలు తదితర కమిటీల్లో ఉన్నారు. ప్రధాని మోదీ అమిత్‌ షాను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో భవిష్యత్తులో ఆయనే చక్రం తిప్పుతారన్న వార్తలు వినవచ్చాయి. దానికి అనుగుణంగానే  ముడి చమురు విషయమై రెండు రోజుల క్రితం జయశంకర్, పీయూష్‌ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, నిర్మలా సీతారామన్‌ సహా వివిధ కేంద్ర మంత్రులు నిర్వహించిన సమావేశాలకు అమిత్‌ షా అధ్యక్షత వహించారు.

రాజ్‌నాథ్‌ సింగ్‌, నిర్మలా సీతారామన్‌

జైట్లీ మాదిరిగానే సీతారామన్‌కు..
ఆరు కమిటీల పునర్‌వ్యవస్థీకరణలో ప్రభుత్వం గతంలో మంత్రిత్వ శాఖలకు ఇచ్చిన ప్రాధాన్యతనే ఇప్పుడూ ఇచ్చిందని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న ఆరుణ్‌జైట్లీ అన్ని కమిటీల్లోనూ ఉన్నారు. ఇప్పుడా పదవి చేపట్టిన నిర్మల సీతారామన్‌కు కూడా అన్ని కమిటీల్లో స్థానం కల్పించారు. కొత్తగా ఏర్పాటు చేసిన రెండు కమిటీలకు ప్రధాని మోదీ అధ్యక్షుడిగా ఉన్నారు. నితిన్‌ గడ్కరీ, పీయూష్‌ గోయల్‌లకు కూడా పలు కమిటీల్లో స్థానం లభించింది.

ప్రభుత్వ విధానాన్ని నిర్దేశించే రాజకీయ వ్యవహారాల కమిటీలో అమిత్‌షా, నితిన్‌ గడ్కరీ, నిర్మలా సీతారామన్, నరేంద్ర తోమర్, రవిశంకర్‌ ప్రసాద్, రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ తదితరులు ఉన్నారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీకి ప్రధాని మోదీ అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రధాన మంత్రి తర్వాత ప్రమాణ స్వీకారం చేసే వ్యక్తి ప్రభుత్వంలో నెంబర్‌ టూగా వ్యవహరించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సారి ప్రధాని తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన రాజ్‌నాథ్‌ సింగ్‌కు అమిత్‌ షాతో పోలిస్తే ఎక్కువ కమిటీల్లో చోటు దక్కక పోవడం విశేషం.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top