మోదీ మాటే చెల్లకపోతే ఎలా?

 PM Modi assurance to assam not fulfilled yet - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న ఈశాన్య రాష్ట్రాల్లో సహాయక చర్యల కోసం 2,350 కోట్ల రూపాయల ప్యాకేజీని విడుదల చేస్తున్నామని, అందులో భాగంగా 250 కోట్ల రూపాయలను అస్సాంకు తక్షణమే విడుదల చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2017, జూలై 31వ తేదీన ప్రకటించారు. అలాగే మృతుల కుటుంబాలకు రెండేసి లక్షల రూపాయల చొప్పున, తీవ్రంగా గాయపడిన వ్యక్తులకు 50 వేల రూపాయల చొప్పున విడుదల చేస్తామని కూడా ఆయన తెలిపారు. అయితే ప్రధాని ప్రకటించిన డబ్బులో ఇంతవరకు నయాపైసా కూడా అస్సాం రాష్ట్రానికి ముట్టలేదు. 2014 నుంచి వరుస వరదలతో అస్సాం రాష్ట్రం తీవ్రంగా నష్టపోతున్నప్పటికీ అదనపు సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక్క ఏడాదికి కూడా ప్రకటించలేదు.

2005లో కేంద్రం తీసుకొచ్చిన చట్టం ప్రకారం ‘స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌’, ‘నేషనల్‌ డిజాస్టర్‌ రెస్సాన్స్‌ ఫండ్‌’లను ఏర్పాటు చేశారు. సాధారణంగా స్టేట్‌ డిజాస్టర్‌ ఫండ్‌కు కేంద్రం 75 శాతం నిధులను కేటాయిస్తే రాష్ట్రం 25 శాతం నిధులను సమకూర్చాలి. అస్సాంకు ప్రత్యేక హోదా ఉండడం వల్ల కేంద్రం 90 శాతం నిధులను కేటాయిస్తే పది శాతం నిధులను మాత్రమే రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. ఏ రాష్ట్రంలో వరదలు సంభవించినా ఆ రాష్ట్రంలోని స్టేట్‌ డిజాస్టర్‌ ఫండ్‌ నుంచి కేంద్రమే నిధులను విడుదల చేస్తుంది. అందుబాటులో ఉన్న నిధులకన్నా నష్టం ఎక్కువగా ఉంటే రాష్ట్రాలు కేంద్రం నుంచి అదనపు నిధులను కోరవచ్చు. అలాంటి సందర్భాల్లో కేంద్రం ‘నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌’ నుంచి అదనపు నిధులను విడుదల చేస్తుంది.

2014లో సంభవించిన వరదల్లో 70 మంది మరణించగా, 40 లక్షల మంది నష్టపోయారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 9, 370 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని కోరగా, 288 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని స్టేట్‌ దిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌ నుంచి కేంద్రం విడుదల చేసింది. 2015 సంవత్సరంలో కూడా వరదల కారణంగా భారీ నష్టం సంభవించగా 2,100 కోట్ల రూపాయల అదనపు నిధులను అస్సాం కోరగా కేంద్రం స్పందించలేదు. అలాగే 2016 సంవత్సరంలో 5,038 కోట్ల రూపాయల సహాయాన్ని కోరింది. అప్పుడు కూడా 434 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిన కేంద్రం అదనపు నిధులను ఇవ్వడానికి నిరాకరించింది. 2017 సంవత్సరంలో వరదల వల్ల అస్సాం రాష్ట్రానికి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అయినా అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్రం నుంచి ఒక్క పైసా సహాయాన్ని కోరులేదు. కేంద్రం ఇవ్వలేదు. అప్పుడు నరేంద్ర మోదీ పలు ఈశాన్య రాష్ట్రాల్లో వరదల వల్ల జరిగిన నష్టాన్ని సమీక్షించిన ప్రధాని మోదీ 2,350 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. అందులో భాగంగా 250 కోట్ల రూపాయలను తక్షణ సహాయం కింద అస్సాంకు అందజేస్తామని హామీ ఇచ్చారు. అందులో ఒక్క పైసా కూడా రాష్ట్రానికి ఇప్పటి వరకు అందలేదని ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వంమే సమాధానం చెప్పింది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాన్నే పట్టించుకోకపోతే, కేంద్రం ఇంకే రాష్ట్రాన్ని పట్టించుకుంటుంది?

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top