 
													సాక్షి, విశాఖపట్నం: ఇసుక సమస్యను రెండు వారాల్లో పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళన తప్పదని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ అన్నా రు. రెండు వారాల్లోగా సమస్యను పరిష్కరించ కపోతే కలెక్టరేట్ల ముందు శిబిరాలు వేసి ఆందోళన చేయాలని జనసేన కార్యకర్తల్ని కోరారు. ఇసుక సమస్యపై తమ పార్టీలోని పెద్దలతో సబ్ కమిటీ వేస్తామని, సమస్యను ఎలా పరిష్కరించాలో ఆ కమిటీ సూచనలిస్తుందన్నారు. విశాఖలోని సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు చోటుచేసుకుంటే సరిచేయాలే తప్ప మొత్తం భవన నిర్మాణ రంగాన్నే ఆపేయకూడదన్నారు. దీనివల్ల 35 లక్షలమంది భవన నిర్మాణ కార్మికులుసహా ఈ రంగంపై ఆధారపడిన కోటి మంది అవస్థ పడుతున్నారన్నారు. ఇసుక కొరతతో పనిలేక చనిపోయినవారి కుటుంబానికి రూ.5 లక్షలు చొప్పున నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలని, పని దొరికేదాకా భవన నిర్మాణ కార్మికులకు ఒక్కొక్కరికి ప్రతినెలా రూ.50 వేల చొప్పున బ్యాంకు ఖాతాలో వేయాలని డిమాండ్ చేశారు.
వారు నన్ను విమర్శించడమా?
సీఎస్‌గా కోరి తెచ్చుకున్న ఎల్వీని బదిలీ చేశారం టే ప్రభుత్వంలో ఏవో లోటుపాట్లు ఉన్నాయని పవన్ ఆరోపించారు. ఒకప్పుడు పూజలు చేసుకుని.. ప్రసాదం పట్టుకుని తన చుట్టూ తిరిగిన ముత్తంశెట్టి శ్రీనివాస్ నన్ను విమర్శించడమా? అని మండిపడ్డారు. రాజకీయాలు చేయడానికి తాను సినిమాలు వదులుకోవాల్సిన అవసరం లేదన్నారు. విశాఖ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు తిప్పికొట్టడాన్ని ప్రస్తావించగా.. అసహనం ప్రదర్శిస్తూ ‘అంబటి రాంబాబు నన్ను విమర్శించడమా?’ అంటూ జనసేన అధినేత సమావేశాన్ని అర్ధంతరంగా ముగించి వెళ్లిపోయారు. 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
