విద్యార్థులతో ముఖాముఖిలో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్
అనంతపురం/ధర్మవరం: ‘అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. కానీ రాష్ట్రంలో చంద్రబాబు తనయుడు లోకేశ్‌కు మినహా ఇంకెవ్వరికీ ఉద్యోగం రాలేదు’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. అనంతపురం పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన ధర్మవరం నియోజకవర్గం గొట్లూరులో చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. అలాగే అనంతపురంలో విద్యార్థులతో మాట్లాడారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. విద్యార్థులతో ముఖాముఖి సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘యూపీఎస్సీ కేలెండర్ ప్రకారం ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
ఆ విధంగా ఏపీపీఎస్సీ ఎందుకు చేయలేకపోతోంది? పాలకుల అవినీతికి అడ్డంకులుండవు గానీ ఉద్యోగాలిచ్చేందుకు మాత్రం అడ్డంకులుంటాయి. అడ్డగోలుగా దోపిడీ చేయడానికి వాడే తెలివితేటలను.. ఉద్యోగాల కల్పనకు కూడా ఎందుకు ఉపయోగించరు? ఒక పరిశ్రమ స్థాపిస్తే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామనే ఆలోచనతో ప్రభుత్వాలు పనిచేయాలి. అమరావతి కేంద్రంగా అభివృద్ధి చేస్తూ మళ్లీ తప్పు చేస్తున్నారు. అభివృద్ధిని వికేంద్రీకరించాలి. జనసేన అధికారంలోకి వస్తే స్పెషల్‌జోన్‌గా తీసుకుని విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.’ అన్నారు.
మహిళా భద్రతకు సింగపూర్ తరహాలో చట్టం..!
ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగినట్లు.. చంద్రబాబు కళ్లెదుట ఏదైనా అఘాయిత్యం జరిగే వరకూ కూడా ఆయన స్పందించేలా లేరని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. సింగపూర్ తరహాలో కఠిన చట్టాలు తీసుకొచ్చి మహిళా భద్రతకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. అత్యాచారాలకు పాల్పడితే పురుషుల మర్మాంగాలు తీసేయాలని కోర్టులు ఉత్తర్వులిస్తున్నాయంటే రాష్ట్రంలో మహిళల భద్రత ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందన్నారు. కదిరికి చెందిన సాయికుమార్ అనే విద్యార్థి మాట్లాడుతూ.. ‘నువ్వు చెప్పావనే టీడీపీకి ఓటేశా. ఇప్పుడు వాళ్లేమో నిరుద్యోగ భృతికి అనేక నిబంధనలు పెట్టి మోసం చేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి పవన్ స్పందిస్తూ.. ‘ఇచ్చిన హామీని ఏడాది అటోఇటో అమలు చేయాలి. కానీ లోకేశ్‌కు మినహా రాష్ట్రంలో ఎవ్వరికీ ఉద్యోగమివ్వలేదు.’ అని విమర్శించారు.
డీఎస్సీలో పోస్టుల సంఖ్యను తగ్గించి మోసం చేశారని, తమ కోసం దీక్ష చేయాలని బలరాం అనే విద్యార్థి కోరగా.. పవన్ స్పందిస్తూ.. ‘ఒకరు న్యాయం చేయరు. ఇంకొకరు ప్రశ్నించరు. వైఎస్ జగన్‌తో పాటు ఆయన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళితే ఇలాంటి సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించొచ్చు. అప్పుడు ప్రభుత్వం స్పందిస్తుంది. కానీ వాళ్లు అసెంబ్లీకి వెళ్లడం లేదు’ అని విమర్శించారు. అంతకుముందు పవన్ గొట్లూరులో చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు, జగన్‌లా సమస్యలు విని వెళ్లే వ్యక్తిని కాదన్నారు. ఈరోజే చేనేత విభాగాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. చేనేత కళాకారులతో కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.


