పోలవరం వైఎస్‌ పుణ్యమే

Parthasarathy comments on Polavaram - Sakshi

     దేవినేని ఉమా స్థాయి మరచి మాట్లాడుతున్నారు 

     చేతకాక.. ప్రతిపక్ష నేతపై విమర్శలు 

     వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి

విజయవాడ సిటీ : పోలవరం ప్రాజెక్టు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పుణ్యమేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి అన్నారు. మహానేత తనయుడిగా పోలవరం గురించి మాట్లాడే హక్కు వైఎస్‌ జగన్‌కే ఉందని చెప్పారు. విజయవాడలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి రాగానే 2017నాటికల్లా ప్రాజెక్టు  పూర్తిచేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రగల్భాలు పలికిందన్నారు. అనంతరం మాటమార్చి 2018లోగా పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయాన్ని మరిచిపోయారని తెలిపారు.

ప్రభుత్వ వైఫల్యం వల్ల 2019లోగానైనా ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదని..  ఒకవేళ ఈ ప్రభుత్వం  ప్రకటించిన గడువు లోపు ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి చేస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని..లేదంటే మంత్రి దేవినేని ఉమా తప్పుకోవాలని ఆయన సవాల్‌ విసిరారు. గోదావరి నీరంతా సముద్రంలో కలుస్తుంటే మహానేత స్పందించి పోలవరానికి శ్రీకా రం చుట్టిన విషయాన్ని గుర్తు చేశారు.

కృష్ణా డెల్టా గురించి ముసలి కన్నీరు కార్చే టీడీపీ నాయకులు పులిచింతల ప్రాజెక్టుకు టెండర్లు ఎందుకు పిలువలేదో సమాధానం చెప్పాలన్నారు. ఉమా తాను చేసే బ్రోకరిజాన్ని కప్పి పుచ్చుకునేందుకు వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేస్తున్నారన్నారు. ఆనాడు చంద్రబాబు, సోనియాగాంధీ కలిసి వైఎస్‌ జగన్‌పై అక్రమ కేసులు పెట్టారని, ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తున్నామన్నారు. టీడీపీ మంత్రులు నోటికివచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. ఎక్కడైనా ప్రాజెక్టు పూర్తి అయిన తరువాత జాతికి అంకితం చేస్తారని, కానీ డయా ఫ్రంవాల్‌ కట్టి పోలవరాన్ని జాతికి అంకితం చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరేనని ఎద్దేవా చేశారు. 

కేసీఆర్‌ అనుమానాన్ని ఉమా నివృత్తి చేయాలి 
మంత్రి దేవినేని ఉమా ‘మగ–ఆడో’ తెలియడం లేదని గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వచ్చిన అనుమానాన్ని ఇప్పడైనా నివృత్తి చేయాలని పార్థసారథి సూచించారు. కేసీఆర్‌ విజయవాడ వచ్చినప్పుడు దేవినేని ఉమా వంగి వంగి దండాలు పెడుతూ తిరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.     

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top