అవిశ్వాసం మళ్లీ తూచ్‌

Parliament conventions to end with today  - Sakshi

సభ ఆర్డర్‌లో లేదంటూ నోటీసులను అనుమతించని స్పీకర్‌

నేటితో ముగియనున్న పార్లమెంట్‌ సమావేశాలు

సాక్షి, న్యూఢిల్లీ :  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన 12వ అవిశ్వాస తీర్మానం నోటీసును లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ గురువారం అనుమతించలేదు. కావేరీ నదీ జలాల యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే సభ్యులు యథావిధిగా సభలో ఆందోళనకు దిగారు. సభ సజావుగా సాగడం లేదంటూ అవిశ్వాస తీర్మానం నోటీసులను లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు స్పీకర్‌ అనుమతి ఇవ్వలేదు.

పదేపదే అదే దృశ్యం
లోక్‌సభ గురువారం ఉదయం ప్రశ్నోత్తరాలతో లోక్‌సభ ప్రారంభమైంది. ఏఐఏడీఎంకే సభ్యులు వెల్‌లో ఆందోళనకు పూనుకోవడంతో కొద్దిసేపటికే సభాపతి సభను వాయిదా వేశారు. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభం కాగా ఏఐఏడీఎంకే సభ్యులు ఎప్పటిలాగే ఆందోళన కొనసాగించారు. ఈ సమయంలో పలు శాఖలకు సంబంధించిన పత్రాలను పలువురు మంత్రులు, సభ్యులు సభలో ప్రవేశపెట్టారు.

అనంతరం అవిశ్వాస తీర్మానం నోటీసుల గురించి స్పీకర్‌ ప్రస్తావించారు. వైఎస్సార్‌సీపీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన  అవిశ్వాస తీర్మానం నోటీసులు తన వద్దకు వచ్చినట్టు సభాపతి చెప్పారు. వాటిని సభలో ప్రవేశపెట్టేందుకు అవసరమైన సంఖ్యా బలాన్ని లెక్కించేందుకు వీలుగా సభ్యులు తమతమ స్థానాల్లో కూర్చోవాలని కోరారు.

సంఖ్యా బలాన్ని తెలియజేసేందుకు వైఎస్సార్‌సీపీ, టీడీపీ, కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, సమాజ్‌వాదీ, జేఎంఎం, ఎంఐఎం తదితర పార్టీల సభ్యులంతా లేచి నిలుచున్నారు. అయితే, స్పీకర్‌ విజ్ఞప్తిని లెక్కచేయకుండా ఏఐఏడీఎంకే సభ్యులు వెల్‌లో ఆందోళన కొనసాగిం చారు. దీంతో సభ ఆర్డర్‌లో లేదని, అవిశ్వాస తీర్మానం నోటీసుల ను సభ ముందుకు తీసుకురాలేకపోతు న్నానని స్పీకర్‌ ప్రకటించారు. సభను శుక్రవారానికి వాయిదా వేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే
పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారంతో ముగియనున్నాయి. కాగా, వైఎస్సార్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై 13వసారి అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. శుక్రవారం నాటి సభా కార్యక్రమాల జాబితాలో ఆ అంశాన్ని చేర్చాలని నోటీసులో కోరారు.

గురువారం ఉదయం 10.30 గంటలకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు  పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేపట్టారు.పార్టీ సీనియర్‌ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, అనంత వెంకట్రామిరెడ్డి తదితరులు వీరికి సంఘీభావం తెలిపారు.

రాజ్యసభలో ఆందోళన
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆందోళనకు దిగారు. ప్లకార్డులు చేతపట్టుకుని వెల్‌లో ఆందోళన నిర్వహించారు.

కాంగ్రెస్‌తో జతకట్టిన టీడీపీ
పార్లమెంట్‌ సమావేశాలను సజావుగా నడపాలని, అన్ని అంశాలపై చర్చించాలంటూ కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలో పలు పార్టీలు గురువారం పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టాయి. ఇందులో టీడీపీ ఎంపీలు కాంగ్రెస్‌ నేతలతో చెట్టపట్టాల్‌ వేసుకుని తిరిగారు.

టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ పక్కన ప్లకార్డు పట్టుకుని నిలుచున్నారు. మరోవైపు సుజనా చౌదరి, తోట నర్సింహం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌తో ముచ్చటిస్తూ కనిపించారు.ఏపీ విభజనకు కాంగ్రెస్సే కారణమంటూ పదేపదే విమర్శించే టీడీపీ ఇప్పుడు అదే పార్టీతో వియ్యానికి తెరలేపింది.

రాజ్యసభ సభ్యుడిగా వేమిరెడ్డి ప్రమాణ స్వీకారం
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా నూతనంగా ఎన్నికైన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గురువారం ఉదయం రాజ్యసభలో ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనను పలువురు ఎంపీలు అభినందించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top