అమిత్‌ షాతో భేటీ.. రంగంలోకి పరిపూర్ణానంద!

 Paripoornananda Swami Meets Ram Madhav - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద క్రమంగా రాజకీయాల దిశగా అడుగులేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో భేటీ అయిన పరిపూర్ణానంద.. బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. అమిత్ షా ఆదేశాల మేరకు తన ప్రచారం ఉంటుందని భేటీ అనంతరం వెల్లడించారు. ‘నా భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. నా ఆసక్తి ప్రధానం కాదు. అమిత్ షా ఆలోచనలు, నిర్ణయాలు, అభిప్రాయాల మేరకు ప్రచారం ఉంటుంది. నవరాత్రులు అయిపోయాక దీనిపై పూర్తిగా చర్చిస్తాం. ఆధ్యాత్మికం, రాజకీయం వేరు కాదు’ అని స్వామి పరిపూర్ణానంద పేర్కొన్నారు. అంతకుముందు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తోనూ పరిపూర్ణానందన భేటీ అయి చర్చించారు.

సెంటిమెంట్‌ కలిసి వస్తుందా?
శ్రీరాముడి విషయంలో కత్తి మహేశ్‌ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా యాత్ర నిర్వహించేందుకు ప్రయత్నించిన పరిపూర్ణానందను హైదరాబాద్‌ పోలీసులు గృహనిర్బంధం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు నగర బహిష్కరణ విధించారు. అయితే, ఈ బహిష్కరణపై హైకోర్టు స్టే విధించడంతో పరిపూర్ణానంద తిరిగి నగరంలో అడుగుపెట్టారు. ఈ వ్యవహారంలో హిందూ సెంటిమెంట్‌కు అనుకూలంగా పరిపూర్ణానంద వ్యవహరించారని, బీజేపీ తరఫున ఆయన ప్రచారం నిర్వహిస్తే.. హిందూ సెంటిమెంట్‌తో మరింత లాభపడవచ్చునని ఆ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యానాథ్‌ తరహాలో తెలంగాణలో స్వామి పరిపూర్ణానంద ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ బరిలోకి దింపే అవకాశముందని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో పరిపూర్ణానంద సోమవారం ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరోవైపు పరిపూర్ణానంద స్వామి బీజేపీలోకి వస్తే స్వాగతమిస్తామని బీజేపీ నేత ధర్మపురి అరవింద్‌ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు ముందుగా తెచ్చిన టీఆర్ఎస్, బతుకమ్మ చీరలను ముందుగా ఎందుకు పంచ లేదని అరవింద్‌ ప్రశ్నించారు. చీరలన్నీ ముందుగానే రెడీ అయినా.. వాటిని ఎందుకు పంచలేదన్నారు. గత ఏడాది బతుకమ్మ చీరల పేరుతో పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు.  డీ ఫ్యాక్టో సీఎం అయిన కవిత బతుకమ్మ జరుపుకోకుంటే మిగతావారూ జరుపుకోవద్దా అని ప్రశ్నించారు. కేసీఆర్, కాంగ్రెస్ నాయకులు  దిగజారి సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top