తెలంగాణలో కాషాయ జెండా

Paripoornananda Swami fires on trs and mahakutami - Sakshi

సాక్షి, కామారెడ్డి: తెలంగాణలో కాషాయజెండా ఎగురవేయడానికి ప్రజలంతా సిద్ధం కావాలని పరిపూర్ణానంద స్వామి పిలుపునిచ్చారు. బీజేపీ నాయకత్వం మిషన్‌–70తో ముందుకు సాగుతోందని, కచ్చితంగా రాష్ట్రంలో ‘కమలం’వికసిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గురువారం రాత్రి కామారెడ్డిలో నిర్వహించిన విజయభేరి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్, మహాకూటమిలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్వయం పాలన కోసం తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని ఐదేళ్లు పాలించమని టీఆర్‌ఎస్‌కు అధికారం ఇస్తే కుటుంబ పాలన సాగించారని ఆరోపించారు.

పాలన చేతగాక కుంటిసాకులు చెప్పి ముందుగానే ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు. కేసీఆర్‌ను ఇంటికి పంపేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి గుండెలపై చేయి వేసుకుని తన నిజాయితీ గురించి చెప్పగలరా అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోదీ కుటుంబసభ్యులంతా సామాన్య జీవనం సాగిస్తున్నారని, యూపీ ముఖ్యమంత్రి యోగి కుటుంబ సభ్యులు అలాగే జీవిస్తున్నారని తెలిపారు. బీజేపీ అంటేనే నీతి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. అవినీతిలో మునిగిపోయిన మహాకూటమి నేతలు మాయమాటలతో వస్తున్నారని, వారిని మట్టి కరిపించాలని పిలుపునిచ్చారు.
 
ఇక బీజేపీ ఖాతాలో తెలంగాణ కూడా..
నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక బాంబు పేలుళ్లు లేవని, మోదీయే బోర్డర్‌ అవతల బాంబులు పేలుస్తున్నారని స్వామి పేర్కొన్నారు. దేశంలో 15 రాష్ట్రాలో బీజేపీ సుస్థిర పాలన సాగిస్తోందని, మరో ఆరు రాష్ట్రాల్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో కలసి నడుస్తోందని, తెలంగాణ రాష్ట్రం కూడా త్వరలోనే బీజేపీ ఖాతాలో చేరుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ వెనుక ఉన్న శక్తి ఆరెస్సెస్‌ అని, హెగ్డేవార్‌ కలలుగన్న పాలన బీజేపీ నాయకత్వంలోనే సాధ్యమన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ 12 శాతం ముస్లిం రిజర్వేషన్లు ఇస్తామని, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జీసస్‌ పాలన అంటాడని, హిందువులంతా చేతులు కట్టుకుని కూర్చోరన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ధర్మం కోసం బీజేపీ పోరాడుతుందని చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని, తనను అకారణంగా బహిష్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను తెలంగాణ ప్రభుత్వం బహిష్కరిస్తే, అమిత్‌షా అక్కున చేర్చుకున్నారని తెలిపారు.

హన్మకొండలో పూజారిపై కొందరు ముష్కరులు దాడి చేస్తే ఆయన చనిపోయాడని, ఏ నాయకుడూ ఆ పూజారి కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. తాను రేపే అక్కడికి వెళుతున్నట్టు పరిపూర్ణానంద పేర్కొన్నారు. నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలంతా బీజేపీని గెలిపించాలని కోరారు. సభలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

నాకు అన్నంపెట్టి కాపాడుకున్న గడ్డ ఇది
తాను కామారెడ్డిలోనే అక్షరాభ్యాసం చేశానని పరిపూర్ణానంద తెలిపారు, ఇక్కడి ప్రజలు అన్నం పెట్టారని, బట్ట ఇచ్చి కాపాడుకున్నారని, తాను కూడా అంతే నిజాయితీగా వ్యక్తిత్వంతో నిలబడ్డానని చెప్పారు. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానో కామారెడ్డి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే తన తొలి సభ ఇక్కడే ఏర్పాటు చేశానన్నారు.

రాజకీయ అరంగ్రేటానికి ముందు అమ్మా, నాన్న, గురువులను అడిగానని, వారందరూ ముందుకు సాగమన్నారని తెలిపారు. అందరూ రాజకీయాల్లో దోచుకోవడానికి, దాచుకోవడానికి వస్తారని, తనకు బంధాలు లేవని, దందాలు అసలే లేవని, నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లో ప్రవేశించానని పరిపూర్ణానంద పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top