‘మిషన్‌ భగీరథలో రూ.50 కోట్ల అవినీతి’

Nagam Janardhan Reddy Fires On TRS Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మిషన్‌ భగీరథలో రూ.50వేల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ నేత నాగం జనార్దన్‌ రెడ్డి ఆరోపించారు. కమీషన్‌లకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ నుంచి కాంగ్రెస్‌ గూటి​కి చేరాక నాగం జనార్దన్‌ రెడ్డి  తొలిసారి గాంధీభవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అవినీతిని, కేసీఆర్‌ నియంతృత్వాన్ని ప్రశ్నించడానికే తాను కాంగ్రెస్‌లో చేరానన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ సాధ్యం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం రైతులను మరింత సంక్షోభంలోకి నెట్టే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

నాలుగేళ్ల కాలంలో పంటలకు గిట్టుబాటు ధర, కరువు మండలాలను ప్రభుత్వం ఎందుకు ప్రకటించలేదని నాగం సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్‌ రెండు లక్షల రుణమాఫీ హామీతో కేసీఆర్‌ చాలా ఆందోళనలో ఉన్నారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని హామీ ఇచ్చారు. రైతు బంధు సాయం కౌలు రైతులకు కూడా అందించాలని డిమాండ్‌ చేశారు. జోనల్‌ వ్యవస్థను ప్రభుత్వం సరిగా చేయటంలేదని విమర్శించారు. ఉద్యోగ సంఘాలతో పాలు అందర్నీ సంప్రదించి జోన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఎక్కడనుంచి పోటీ అనేది అధిష్టానం​ నిర్ణయం
రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది అధిష్టానం నిర్ణయిస్తోందని నాగం పేర్కొన్నారు. తన రాకను వ్యతిరేకించిన దామోదర్‌ రెడ్డిని కలిసి మాట్లాడానన్నారు. ఇద్దరం కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని దామోదర్‌ను కోరినట్లు నాగం జనార్థన్‌ రెడ్డి తెలిపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top