మహిళా ఓటర్లు ఎక్కువ అయినా.. అసెంబ్లీకి దూరం 

Majority of women voters in Mizoram but they are away from the assembly - Sakshi

అక్కడ మహిళల సంఖ్య ఎక్కువే. వారికి ఆత్మవిశ్వాసమూ ఎక్కువే. స్కూటర్ల మీద రయ్‌ రయ్‌మని వెళ్లిపోతుంటారు. చదువుల్లో మగవారినే మించిపోయారు. పారిశ్రామిక రంగంలో పురుషులతో పోటీ పడుతున్నారు. కానీ.. రాజకీయాలకు వచ్చేసరికి వారికి చోటే లేదు. అదేమంటే రాజకీయం అన్నది మగాళ్లు చేసే పని. ఆడవాళ్లకు చేతకాదు అన్న బూజుపట్టిన అభిప్రాయాలే వినిపిస్తూ ఉంటాయి. అదే మిజోరం..

మిజోరంలో వాస్తవానికి పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ. ప్రతీ వెయ్యి మంది పురుషులకు 1,051 మంది మహిళలు ఉన్నారు. వారిలో చైతన్యం ఎక్కువే. ఎన్నికలొస్తే గంటల తరబడి పోలింగ్‌ బూతుల దగ్గర బారులతీరు నిల్చొని మరీ తమ ఓటు హక్కుని వినియోగించుకుంటారు. కానీ అసెంబ్లీకి పోటీ అంటే అందని ద్రాక్షే. ఇప్పటి వరకు కేవలం నలుగురంటే నలుగురు మహిళలు మాత్రమే అసెంబ్లీకి ఎన్నికయ్యారు.  

ఈసారీ మొండి చెయ్యే ! 
ఈ సారి ఎన్నికల్లో ఏ పార్టీ కూడా మహిళలకు సీటు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. 2003లో చివరి సారిగా మిజో నేషనల్‌ ఫ్రంట్‌ మహిళకి టిక్కెట్‌ ఇస్తే, కాంగ్రెస్‌ తరఫున ప్రస్తుతం ఒక్క మహిళే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి జోర్‌మాతాంగా మహిళలకు టిక్కెట్‌లు ఇవ్వకపోవడాన్ని అడ్డంగా సమర్థించుకుంటున్నారు. మహిళలకు గెలిచే సత్తా ఉంటే తప్పకుండా ఇస్తాం. కానీ ఎన్నికల్లో నెగ్గుకొచ్చే మహిళామణులెవరూ కనిపించడం లేదు అని అంటున్నారు. గత ఏడాదే ఏర్పాటైన మరో రాజకీయ పార్టీ జోరమ్‌ పీపుల్స్‌ మూమెంట్‌ (జడ్‌పీఎం) ఇద్దరు మహిళలకు టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. కేవలం పార్టీలే కాదు అక్కడ సమాజంలో కూడా ఇంకా మహిళలు రాజకీయాల్లోకి రావడాన్ని కొత్తగానే చూస్తున్నారు. 2003లో అయిదుగురు మహిళలు ఎన్నికల బరిలో ఉన్నారు.. 2008 నాటికి వారి సంఖ్య తొమ్మిదికి పెరిగింది.

కానీ అందరూ స్వతంత్ర అభ్యర్థులగానే బరిలోకి దిగారు. ఓటర్లు మాత్రం వారిని తిరస్కరించారు. సాధారణంగా మహిళలు ఎక్కువగా ఉండడం సామాజిక పురోగతిని సూచిస్తుంది. కానీ రాజకీయాలు వచ్చేసరికి అదే సంకుచిత ధోరణే వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో విపక్షాల నుంచి మరో వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ మద్య నిషేధాన్ని ఎత్తివేయడంతో ఎందరో మగవాళ్లు చీప్‌ లిక్కర్‌ తాగి చనిపోతున్నారని, అందుకే మహిళల సంఖ్య పెరిగిపోతోందని దానివల్ల ఓటింగ్‌లో వారు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారన్న విచిత్ర వాదన ఒకటి తెరపైకి తెచ్చారు. ఇటీవల కాలంలో నమోదైన మరణాల సంఖ్యలో 80–85 శాతం మంది మగవారేనంటూ ఎంఎన్‌ఎఫ్‌ నేత జోర్‌మాతాంగా వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.

మరోవైపు మిజోరంలో యువతులు తమకి రాజకీయాలపై ఆసక్తి లేదని అంటున్నారు. రాష్ట్రంలోని వివిధ కాలేజీల్లో విద్యార్థినుల్ని ప్రశ్నిస్తే కెరీర్‌వైపే తమ దృష్టి ఉందని అంటున్నారు. ‘‘మిజోరం మహిళలు విద్యావంతులు. మగవారిలో కంటే చిత్తశుద్ధి ఎక్కువే. కానీ ఎందుకో తెలీదు వారికి రాజకీయాలంటే ఆసక్తి లేదు‘అని క్రిస్టీ అనే విద్యార్థిని వెల్లడించారు. కొంతమందిలో ఆసక్తి లేకపోతే లేకపోవచ్చు కానీ కొందరు మహిళల్లో రాజకీయాల్లోకి రావాలనే ఉత్సాహం ఉంది. మరి అలాంటి ఉత్సాహవంతులనైనా పార్టీలు ప్రోత్సహిస్తాయా ? వేచి చూడాల్సిందే.  

ఆ నలుగురు.. 
1. థాన్మావి. 1978లో తొలిసారిగా అసెంబ్లీకి.
2. కె. థాన్సియామి. అయిజ్వాల్‌ (పశ్చిమ) నుంచి 1984లో ఎన్నిక 
3. లాల్‌హింపూయి హమర్, 1987లో ఎమ్‌ఎన్‌ఎఫ్‌ తరపున ఎన్నిక. 
4. 20 ఏళ్ల తర్వాత 2014 ఉప ఎన్నికల్లో వన్లలంపూయీ చ్వాంగ్తూ కాంగ్రెస్‌ తరఫున అసెంబ్లీకి ఎన్నికయ్యారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top