కొత్త ముఖాలు!

Lok Sabha Elections Suspension On telangana MP Seats - Sakshi

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసేందుకు స్థానిక నేతలెవరూ ముందు కు రాకపోవడంతో కాంగ్రెస్‌ అధిష్టానం ప్రత్యామ్నాయంపై దృష్టి సారించింది. ఈ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా ఉన్న ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కి ఈసారి ఇక్కడి నుంచి పోటీకి సుముఖత చూప డం లేదు. దీంతో అధిష్టానం అభ్యర్థి విషయంలో అన్వేషణలో పడింది. ఇందులో భాగంగా మాజీ ఇండియన్‌ క్రికెటర్‌ అజారుద్దీన్‌ పేరు తెరపైకి వచ్చింది. ఎంపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇటీవల ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ గాంధీభవన్‌లో సమావేశమైంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన పలువురు ముఖ్యనేతలు సమావేశానికి హాజరయ్యారు. నిజామాబాద్‌ స్థానం అంశం చర్చకొచ్చిన సందర్భంగా అజారుద్దీన్‌ పేరును మధుయాష్కి ప్రస్తావించారు.

దీనిపై జిల్లా నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. స్థానికేతరుల పేర్లను ప్రస్తావించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్నప్పుడు రెండుసార్లు విజయం సా«ధించారు.. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేశారు.. ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు చేతులెత్తేస్తే ఎలా..?’’ అని మధుయాష్కిపై అసహనం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అజారుద్దీన్‌తో పాటు మరో మైనారిటీ నేత పేరు కూడా అధిష్టానం పరిశీలనలోకి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా రాష్ట్రంలో మైనారిటీ ఓటర్లు అధికంగా ఉన్న పార్లమెంట్‌ స్థానాల్లో నిజామాబాద్‌ ఒకటి. ఇక్కడ మైనారిటీ ఓట్లు భారీగానే ఉంటాయి. ముఖ్యంగా నిజామాబాద్‌ అర్బన్, బోధన్‌ నియోజకవర్గాల్లో మైనారిటీ ఓట్లు అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో మైనారిటీ అభ్యర్థిని బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే అంశాన్ని అధిష్టానం పరిశీలిస్తోందని ఆ పార్టీ ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారు.

చేతులెత్తేసిన మధుయాష్కి.?
మాజీ ఎంపీ మధుయాష్కి నిజామాబాద్‌ నుంచి బరిలో నిలిచే అంశంపై దాదాపు చేతులెత్తేశారు. ఈ మేరకు ఆయన పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇటీవల అరెస్టయిన పసుపు, ఎర్రజొన్న రైతులను పరామర్శించేందుకు శుక్రవారం సాయంత్రం నిజామాబాద్‌ జిల్లా జైలుకు వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశాన్ని విలేకరులు ప్రస్తావించగా, ఆయన సమాధానాన్ని దాటవేశారు.

మళ్లీ మాట్లాడుదామంటూ సమాధానమిచ్చారు. కాగా నాలుగు నెలల క్రితం వరకూ తానే నిజామాబాద్‌ ఎంపీ బరిలో ఉంటానని మధుయాష్కి ఖరాకండీగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు తనకు ఇతర రాష్ట్రాల్లో పార్టీ కీలక బాధ్యతలు కూడా ఉన్నాయనే అంశాన్ని ప్రైవేటు సంభాషణల్లో ప్రస్తావిస్తుండటం గమనార్హం. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్‌ పార్టీ ఇంకా కోలుకునేలా కనిపించడం లేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top