
న్యూఢిల్లీ: మరణశిక్ష రద్దుపై ఏకాభిప్రాయం తీసుకునే అవసరం ఉందని.. దీనిపై అన్ని రాష్ట్రాల అభిప్రాయం రావాల్సి ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాజ్యసభలో మరణశిక్ష రద్దు కోరుతూ.. ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ఎంపీ ప్రదీప్ తమ్తా అడిగిన ప్రశ్నకు కిషన్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ.. ఈ అంశం ఉమ్మడి జాబితాలో ఉన్నందున.. కేవలం కేంద్రం నిర్ణయం తీసుకోలేదని, రాష్ట్రాలు కూడా అంగీకరించాలని తెలిపారు. కాగా ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తోందని.. దీనిపై నివేదిక వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంటుందన్నారు. మరణ దండన విధించాలనేది తమ అభిప్రాయం కాదంటూ.. దోషులకు మరణశిక్ష విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని గుర్తు చేశారు.
నిర్భయ ఘటన సమయంలో దోషులకు ఉరిశిక్ష విధించాలని ప్రజలు కోరారని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీంతో పాటు మరణ శిక్షను రద్దు చేసే అధికారం రాష్ట్రపతి, గవర్నర్‌లకు ఉందన్నారు. అసాధారణ పరిస్థితుల్లోనే మరణ శిక్ష విధిస్తారని చెబుతూ.. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని ప్రదీప్ తమ్తాను కోరారు.
దీనిపై ప్రదీప్ తమ్తా స్పందిస్తూ మరణ శిక్షకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ ముందుకు వస్తున్నాయని అన్నారు. అన్ని రాష్ట్రాలతో ఈ అంశాన్ని కేంద్రం చర్చిస్తుందని మంత్రి హామీ ఇచ్చిన నేపథ్యంలో బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.