కేసీఆర్‌ మాటలు నీటి మూటలు

Kishan Reddy Slams TRS government On Groundwater Levels - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో భూగర్భజలాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని బీజేపీ శాసనసభ పక్ష నేత కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘గ్రామీణ ప్రాంతాల్లో రైతులు అనేక కష్టాలు ఎదర్కొంటున్నారు. రబీలో వేసిన పంటలు ఒక ఎకరం కూడా ఎండనివ్వనని కేసీఆర్‌ చెప్పారు. కానీ ఆయన మాటలు నీటి మూటలు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 100 మండలాలోల​ తీవ్ర కరువు పరిస్థితలు ఉన్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 4 నుంచి 5 మీటర్ల దిగువకు భూగర్భ జలాలు చేరాయి’ అని తెలిపారు.

తెలంగాణని ధనిక రాష్ట్రం అని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని, కరువు సహాయం కింద కేంద్రం వెయ్యి కోట్లు ఇస్తే ఇప్పటివరకు అవి ప్రజలకు అందలేదని ఆరోపించారు. సన్న బియ్యంతో అన్నం పెడతామని చెబుతున్నారు, కానీ ప్రజల కడుపు కాలే పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. మిషన్‌ భగీరథపై ఉన్న ప్రేమ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తాగునీరు అందించడంపై లేదన్నారు. తాగునీరులేక ఉత్తర తెలంగాణలోని గిరిజనులు వలస పోతున్నారని ఆయన తెలిపారు.

కేవలం జనగామ జిల్లాలోనే 20 వేల ఎకరాల పంట నష్టం వాటిల్లిందని కిషన్‌రెడ్డి అన్నారు. భూగర్భ జలాలు పడిపోవడం వల్ల బోరుబావులు ఎండిపోయాయని తెలిపారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల కూడా కూరగాయలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల అవసరాలను పట్టించుకోకుండా రైతులకు ఇచ్చే 4వేల రూపాయలను సర్వరోగ నివారిణి లాగా చెప్తున్నారని,  ప్రభుత్వం పుండు ఒకటి ఉంటే మందు మరోటి వేస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిపై అఖిలపక్షం ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించకూడదు, శాసనసభలో కూడా ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తుందని సర్కార్‌ తీరుపై మండిపడ్డారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top