
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు జెడ్పీ స్థానాల్లో మనమే గెలవాలి... జిల్లా పరిషత్‌లపై గులాబీ జెండా రెప రెపలాడాలి... నిన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్, మహబూబాబాద్ స్థానాల్లో మనమే గెలవబోతున్నాం.. అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించిన మీకు అభినందనలు’ అంటూ గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఓరుగల్లు ప్రజాప్రతినిధులకు కితాబునిచ్చారు.
సమావేశానికి ముందు.. తర్వాత
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సోమవారం టీఆర్‌ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముందు, తర్వాత తనను కలిసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ అభ్యర్థులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కేసీఆర్ మాట్లాడారు. ఈ భేటీలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ బండా ప్రకాష్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, దాస్యం వినయభాస్కర్, ఆరూరి రమేష్, డాక్టర్ తాటికొండ రాజయ్య, డీఎస్.రెడ్యానాయక్, మాజీ స్పీకర్ మదుసూదనాచారి, మాజీ మంత్రి చందూలాల్, ఎంపీ అభ్యర్థులు పసునూరి దయాకర్, మాలోతు కవితతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా, మండల పరిషత్ ఎన్నికలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో గెలవబోతున్నామని కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు మరింత చేరువగా ఉండాలని, ప్రజలే పార్టీకి హైకమాండ్ అని పేర్కొన్న ఆయన వారి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. రెవెన్యూ, మున్సిపల్ శాఖలను ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా సీఎం నేతలకు వివరించిన అధినేత.. ఆ ప్రక్షాళన తర్వాత ప్రజల్లో పార్టీ, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని పేర్కొన్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం ఆరు జెడ్పీ స్థానాలతో పాటు అన్ని ఎంపీటీసీ స్థానాలు, మండల పరిషత్‌లను కైవసం చేసుకునేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించలని కేసీఆర్ సూచించారు.
ఇన్‌చార్జ్‌లకు బాధ్యతలు
ఒక్కో జిల్లా పరిషత్ బాధ్యతలను సీనియర్ నేతకు గులాబీ దళనేత, సీఎం కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. మహబూబాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల ఇన్‌చార్జ్ బాధ్యతలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. అదే విధంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, జనగామ జిల్లా బాధ్యతలను పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అప్పగించారు. మండల పరిషత్ బాధ్యతలను ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు చూసుకోవాలని సూచించారు.
అభ్యర్థుల ఎంపిక, కార్యవర్గం ఏర్పాటు తదితర ప్రక్రియ పూర్తయ్యేవరకు అవసరమైన ఏర్పాట్లను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని కేసీఆర్ పేర్కొన్నట్లు పార్టీవర్గాల సమచారం. కాగా, రెవెన్యూ, మున్సిపల్ చట్టాలపై చర్చించిన సీఎం.. రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై సీనియర్ నేతల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు చెప్పారు.