దేవెగౌడతో భేటీ అయిన కేసీఆర్‌

KCR To Meet Devegowda Over Formation Of Third Front - Sakshi

సాక్షి, బెంగళూరు : టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం మాజీ ప్రధానమంత్రి దేవెగౌడతో భేటీ అయ్యారు. దేవెగౌడ నివాసం అమోఘలో జరిగిన ఈ సమావేశంలో సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌, ఎంపీ వినోద్‌, సంతోష్‌ కుమార్‌, సుభాష్‌ రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత రాజకీయాలు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై కేసీఆర్‌  ఈ సందర్భంగా దేవెగౌడతో చర్చించినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం దేవెగౌడ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ తో దేశ రాజకీయాలు చర్చించడం సంతోషంగా ఉందన్నారు. కుమారస్వామితో కలిసి దేశ రాజకీయాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు.

ఇక జాతీయస్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టి.. దేశంలో గుణాత్మక మార్పుల కోసం ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ రావాలంటున్న కేసీఆర్‌.. ఇటీవలే కోల్‌కతాలో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీతో కేసీఆర్‌ భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత హేమంత్‌ సోరేన్‌ హైదరాబాద్‌ వచ్చి కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఇపుడు కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్‌, దేవెగౌడల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

కేసీఆర్‌ శుక్రవారం ఉదయం 9.45 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లిన విషయం తెలిసిందే. దేవగౌడతో భేటీ అనంతరం ఇవాళ సాయంత్రం సీఎం హైదరాబాద్‌ చేరుకుంటారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top