జాతకం తారుమారు అయ్యిందా? 

Karnataka:disqualified MLAs In Dilemma  - Sakshi

అనర్హతతో కేబినెట్‌లో చోటు హుళక్కే    తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో కంగారు  

సంచలనాలన్నీ తిరుగుబాటు ఎమ్మెల్యేల చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. వారి రాజీనామాలతో కుమార సర్కారు కూలిపోగా, ఇప్పుడు వారివంతు వచ్చింది. మూకుమ్మడిగా అనర్హత వేటు పడడంతో రెబెల్స్‌ సందిగ్ధంలో పడిపోయారు. యడియూరప్ప ప్రభుత్వంలో మంత్రుల పదవులు ఊరిస్తూ ఉండగా ఇలా జరిగిందేమిటని కంగుతిన్నారు. 

సాక్షి, బెంగళూరు: అసంతృప్త ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడంతో బీజేపీ ప్రభుత్వ మంత్రివర్గ కూర్పు మారిపోయే అవకాశాలున్నాయి. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన రెబెల్స్‌కు కేబినెట్‌లో చోటు కల్పించాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు వారిపై అనర్హత వేటు వేయడంతో పదవులు దక్కడం అనుమానమే. ఈ పరిణామం అధికార బీజేపీ ఎమ్మెల్యేల్లో సంతోషాన్ని నింపింది. తమ పదవులకు ఢోకా లేదని సీనియర్లు ఊహల్లో విహరిస్తున్నారు. ఒకవేళ రాజీనామాలను స్పీకర్‌ ఆమోదిస్తే వారికే బీజేపీ టికెట్‌ ఇచ్చి ఉప ఎన్నికలు జరపాల్సి ఉండేది. గెలిచిన అభ్యర్థులకు బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగిరి ఇవ్వాల్సి ఉంది.  

చదవండికర్ణాటక స్పీకర్‌ సంచలన నిర్ణయం

పదవుల సంగతేమిటి?  
అనూహ్యంగా అందరిమీదా అనర్హత వేటు పడడంతో అసంతృప్త ఎమ్మెల్యేలు ఆందోళనకు గురవుతున్నారు. అనర్హత గురయిన ఎమ్మెల్యేలంతా సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు. సుప్రీంలో తమకు అనుకూలంగా తీర్పు వస్తే మంత్రి పదవులను డిమాండ్‌ చేసేందుకు ఆస్కారముంది. వ్యతిరేకంగా వస్తే మంత్రి పదవిపై ఆశలు వదులుకోవాల్సిందే. కానీ ప్రభుత్వంలోని బోర్డులు, నామినేషన్ల అధ్యక్షులు, డైరెక్టర్ల పదవులను చేపట్టడానికి ఏ అడ్డంకీ లేనందున ఆ పదవులనే రెబెల్స్‌ డిమాండ్‌ చేయవచ్చు.

ఆది నుంచీ ఆవేశాలు  
అనర్హతకు గురయిన రెబెల్‌ ఎమ్మెల్యేల భవిష్యత్తు ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. దురాశకు వెళ్లి ఉన్న పదవులు పోగొట్టుకున్నారనే విమర్శలు రెబెల్‌ ఎమ్మెల్యేలపై వస్తున్నాయి. స్పీకర్‌ అనర్హత వేటు వేయడంతో వీరు 2023 వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి వీలు లేకుండా పోయింది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అప్పటి సీఎం కుమారస్వామితో పొసగడం లేదు. 14 నెలల పాలన కాలం లో విమర్శలు గుప్పిస్తూ కాం గ్రెస్, జేడీఎస్‌ నేతలకు మింగు డు పడకుండా తయారయ్యా రు. పదవులు దక్కలేదన్న ఆగ్రహంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలని ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. రాజీనామాలతో మొత్తం సంకీర్ణం చాపకిందకు నీళ్లు వచ్చాయి. ఇప్పుడు రెబెల్స్‌ భవిత ఏమిటనేది చర్చనీయాంశమైంది. 

అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు 
ఎ.శివరామ్‌ హెబ్బార్‌ ( యల్లాపుర),  శ్రీమంత్‌ పాటిల్‌ (కాగవాడ); బైరతి బసవరాజు (కృష్ణరాజపురం); మునిరత్న ( రాజరాజేశ్వరి నగర); ఆర్‌.రోషన్‌ బేగ్‌ (శివాజీనగర);  ప్రతాప్‌ గౌడ పాటిల్‌ (మస్కి); కేసీ నారాయణ గౌడ (కేఆర్‌ పేట);  కె.గోపాలయ్య(మహాలక్ష్మి లేఔట్‌); ఎంటీబీ నాగరాజు (హోసకోటె); కె.సుధాకర్‌ (చిక్కబళ్లాపుర); హెచ్‌. విశ్వనాథ్‌(హుణసూరు); బీసీ పాటిల్‌ (హీరేకరూర్‌); ఆనంద్‌ సింగ్‌ (హొసపేట); ఎస్‌టీ సోమశేఖర్‌ (యశ్వంతపుర).  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top