ట్విట్టర్‌లోనూ మాటల తూటాలే

Karnataka CM Siddaramaiah's Modi jibe sparks Twitter war - Sakshi

నంబర్‌వన్‌ రాష్ట్రానికి ప్రధానికి స్వాగతం: సీఎం

అవినీతి, నేరాల్లోనే నంబర్‌వన్‌: యడ్డి

పరస్పరం ట్వీట్లు

సాక్షి, బెంగళూరు:  బీజేపీ పరివర్తన ర్యాలీ ముగింపు సందర్భంగా ఆదివారం నగరంలోని ప్యాలెస్‌ మైదానంలో నిర్వహించిన కార్యక్రమం, ప్రధాని నరేంద్రమోదీ పర్యటన, చేసిన ప్రసంగంపై అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల విమర్శల యుద్ధం, కన్నడ సంఘాల నిరసనలు చోటుచేసుకున్నాయి.

సిద్ధు ట్వీట్‌.. యడ్డి రిట్వీట్‌
బెంగళూరుకు ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ సీఎం సిద్ధరామయ్య... నంబర్‌ వన్‌ రాష్ట్రానికి ప్రధాని మోదీకి ఘన స్వాగతం ఆదివారం ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. దీనిపై బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప స్పందిస్తూ.. అవును కర్ణాటక రాష్ట్రం దేశంలో నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది, అది కేవలం అవినీతి, అక్రమాలు, రైతుల ఆత్మహత్యలు,నేరాల్లో మాత్రమే.. అని రిట్వీట్‌ చేశారు.

ట్విట్టర్‌లో కుమారస్వామి కూడా
ట్విట్టర్‌ నుంచే మోదీకి జేడీఎస్‌ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి స్వాగతం పలికారు. దశాబ్దాల కాలంగా ఉత్తర కర్ణాటక తాగు,సాగునీటికి ప్రాణవాయువు లాంటి మహదాయి, కళసా బండూరీ నదీ జలాల పంపిణీ వివాదాన్ని కూడా పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మహదాయి రైతుల నిరసన
మహదాయి నదీ జలాల పంపిణీపై ప్రధాని మోదీ ప్రస్తావించకపోవడంపై మహదాయి పోరాట సంఘాల కార్యకర్తలు నగరంలో పలుచోట్ల నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని చిత్రపటానికి పూలమాలలు వేసి మోడీజీ గెట్‌వెల్‌ సూన్‌ ఫర్‌ మహదాయి నినాదాలతో కూడిన ప్లకార్డులతో నిరసనలు జరిపారు. కన్నడ పోరాట సంఘాల కార్యకర్తలు ప్యాలెస్‌ మైదానం వెలుపల శవయాత్రను నిర్వహించారు.

పకోడీల విక్రయాలతో నిరసనకు యత్నం
పకోడీలు విక్రయించడం కూడా గౌరవప్రదమైన వ్యాపారమేనని ప్రధాని చెప్పడం సరికాదంటూ  ప్యాలెస్‌ మైదానం ఎదుట పకోడీలు విక్రయించడం ద్వారా కాంగ్రెస్‌ విద్యార్థి సంఘం కార్యకర్తలు నిరసనకు విఫలయత్నం చేశారు. నిరసనలకు అనుమతినివ్వాలని ఎన్‌ఎస్‌యూఐ చేసిన విన్నపాన్ని పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌కుమార్‌ తిరస్కరించారు. అయినప్పటికీ కార్యకర్తలు పకోడీ విక్రయం ద్వారా నిరసన చేయడానికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top