కమల్‌.. నాస్తికత్వంతో ఎలా?

Kamal Haasan Atheism will Survive in Tamil Politics - Sakshi

సాక్షి, చెన్నై : రాజకీయ అరంగ్రేటంపై ఊరిస్తూ వచ్చిన లోకనాయకుడు ‘మక్కళ్‌ నీది మయ్యం’ పేరిట పార్టీని ప్రకటించి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. పార్టీ విధివిధానాల్లో వైవిధ్యత ఉంటుందని చెబుతున్నప్పటికీ.. అది ఎంతవరకు ఆచరణ సాధ్యమో తెలియాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఈ క్రమంలో ద్రవిడ భావజాలాన్ని తన పార్టీ అనుసరించే తీరుతుందన్న సంకేతాలను ఆయన అందించారు.

గతాన్ని ఓసారి పరిశీలిస్తే... 
ద్రవిడ పార్టీలకు ప్రధాన పునాది నాస్తికత్వం. మతం, ఆధ్యాత్మికతను తీవ్రంగా వ్యతిరేకం. బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా, కుల వివక్షపై పోరాటం దిశగా అవి పుట్టుకొచ్చాయి. అయితే ఆ క్రమంలో పార్టీలు (డీఎంకే తప్ప) తమిళ రాజకీయాల్లో పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. డీకే(ద్రవిడ కగళమ్‌)ను ఇందుకు ఉదాహరణగా విశ్లేషకులు చూపిస్తుంటారు. డీఎంకే నుంచి అన్నాడీఎంకే ఏర్పడ్డాక ఎంజీఆర్‌ కొంత ఉదారంగా వ్యవహరించటం మొదలుపెట్టారు. స్వతహాగా దేవుడ్ని నమ్మే ఆయన.. రహస్యంగా ఆయన దేవాలయాలను సందర్శించేవారన్న వార్త బయటకు పొక్కటం.. ఆయన వ్యవహార శైలిపై విమర్శలు వచ్చాయి. 

పదేళ్ల క్రితం ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరుణానిధి శ్రీపురం స్వర్ణ దేవాలయం సందర్శించుకోవటం తీవ్ర విమర్శలకు దారితీసింది. నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగే క్రమంలో శివాజీ గణేశన్‌కు ఇలాంటి సమస్యే ఎదురైంది. అస్థికుడు అయినప్పటికీ తొలినాళ్లలో ఆయన డీఎంకే మద్ధతుదారుడిగా ఉన్నారు. ఓసారి తిరుమలకు వెళ్లి దేవుడ్ని దర్శించుకోగా.. డీఎంకే ఆయనను తీవ్రంగా మందలించింది. తర్వాత కాంగ్రెస్‌పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావటం, 1987లో ‘తమిళ మున్నేట్ర మున్నాని’ పార్టీ స్థాపన, ప్రత్యర్థుల దెబ్బకు అది మనుగడ కొనసాగించలేకపోవటం.. ఇలా అస్తికత్వం మూలంగానే ఆయన విఫలం అయ్యారని చెబుతుంటారు. మరి అలాంటప్పుడు ఆధ్యాత్మిక పాలన నినాదంతో రాజకీయాల్లోకి వస్తున్న రజనీకాంత్‌ ఎలా రాణిస్తాడో?

జయ విషయంలో మాత్రం ...
ఇక జయలలిత అయితే మొదటిసారి అధికారం చేపట్టగానే ద్రవిడ సిద్ధాంతాలకు, దాని భావజాలానికి కాస్త దూరంగా ఉన్నారు. దేవాలయాలకు విరాళాలు ఇచ్చారు. దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు. అలాగని ఆమె పూర్తిగా ఆ సిద్ధాంతాన్ని విస్మరించలేదు. దీంతో ఆమె ద్వంద్వ వైఖరిపైనా ద్రవిడ భావజాల పార్టీలు విమర్శలు గుప్పించేవి. కానీ, ప్రజలను ఆకర్షించడమే ధ్యేయంగా పెట్టుకున్న జయలలిత అనేక జనాకర్షక పథకాలు రూపొందించి విజయవంతం అయ్యారు. 

కాలక్రమేణా ఇప్పుడున్న పరిస్థితుల్లో సిద్ధాంతాల కన్నా.. జనాకర్షణ మీదే ప్రధాన దృష్టి ఆకర్షించాల్సి ఉంటుంది. ఆర్కే నగర్‌ ఉప ఎన్నికల్లో దినకరన్‌ గెలుపునకు ఎన్ని కారణాలు ఉన్నా.. ప్రజల్లో దినకరన్‌ పై సానుభూతి ఒకటి నెలకొందన్న విషయం అర్థమైంది. ఆ క్రమంలో నటుడిగా ఛరిష్మా ఉన్న కమల్‌ రాజకీయాల్లో సమతుల్యత పాటించాల్సి ఉంటుంది. అలాకానీ పక్షంలో రాజకీయ చదరంగంలో మరో ఫెయిల్యూర్‌ స్టార్‌గా కమల్‌ మిగిలిపోవాల్సి వస్తుందన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం​ చేస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top