కేసీఆర్‌ పగటి కలలు కంటున్నారు : కె.లక్ష్మణ్‌

K Laxman Comments On KCR Over MPTC ZPTC Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  కేంద్రంలో మంత్రులు అవుతామని, చక్రం తిప్పుతామని కేసీఆర్‌ పగటి కలలు కంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె లక్ష్మణ్‌ అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ల్యాండ్‌ మాఫియా పెరిగిపోయిందని, ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. ప్రతి పల్లెలో బెల్ట్‌ షాపులు తెరిచారని, అత్యధికంగా రాష్ట్ర ఆధాయం మద్యం ద్వారా వస్తోందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మీద కాంగ్రెస్‌ హయాంలో వేలకోట్ల అవినీతి జరిగిందని.. దానిపై విచారణ చేస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు.

రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా.. వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో ఓడించారు.. అయినా ప్రభుత్వానికి కనువిప్పు కలగలేదని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఆదరబాదరగా వెళ్తున్నారని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ లేదని, తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఆరు శాతం మాత్రమే జెడ్పీ స్థానాలపై బీసీలకు కేటాయించారని, 34శాతం ఉన్న రిజర్వేషన్లను 23శాతానికి తగ్గించారని ఇంకా తగ్గించాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీసీలు ఈ విషయంపై ఆలోచించాలని సూచించారు. ప్రత్యక్ష ఎన్నికలు కాకుండా పరోక్ష ఎన్నికలకు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొందరపాటుగా రాజకీయ దురుద్దేశంతో ఎన్నికలు నిర్వహిస్తున్నారని తెలిపారు. 

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. తాము సమాయత్తం అవుతామని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికలకు కార్యవర్గ సమావేశాలు జరిపి స్థానిక సంస్థల అభ్యర్థులను ఎన్నుకుంటామని తెలిపారు. రేపు పదాధికారులు, జిల్లా ఇంఛార్జీల సమావేశం ఉంటుందని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిస్తామని పేర్కొన్నారు. మోదీ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసానికి సిద్దమా అని తాను ఓ సవాల్‌ విసిరానని.. అయితే ఇంత వరకు దానికి స్పందన లేదని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top