కూటమి లేదన్నారు.. ఇలా ఫిక్స్ అయ్యారు! | JDS and BSP into alliance for upcoming Karnataka assembly elections | Sakshi
Sakshi News home page

కూటమి లేదన్నారు.. ఇలా ఫిక్స్ అయ్యారు!

Feb 8 2018 1:59 PM | Updated on Feb 8 2018 2:23 PM

JDS and BSP into alliance for upcoming Karnataka assembly elections - Sakshi

జేడీఎస్ నేత దేవెగౌడ, బీఎస్పీ చీఫ్ మాయావతి (ఫైల్ ఫొటో)

సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో కొత్త కూటమి ఏర్పడింది. జనతాదల్‌ (జేడీఎస్‌) పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)లు కూటమిగా ఏర్పడినట్లు ప్రకటించాయి. వచ్చే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసే బరిలోకి దిగనున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ కూటమిగానే పోటీ చేస్తామని జేడీఎస్ నేత డానిష్ అలీ, బీఎస్పీ నేత సతీశ్ చంద్ర మీడియా సమావేశంలో వెల్లడించారు. మొత్తం 224 సీట్లకు గానూ తమ పొత్తులో భాగంగా 20 సీట్లను జేడీఎస్ పార్టీ బీఎస్పీకి కేటాయించింది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలపై ఉన్న వ్యతిరేకత తమ విజయానికి అనుకూలిస్తుందని జేడీఎస్-బీఎస్పీ నేతలు భావిస్తున్నారు. ఏదేమైనా ఈసారి పొత్తు మాత్రం తాము ఎవరితో పెట్టుకోబోమని స్పష్టం చేసిన జేడీఎస్ మాత్రం బీఎస్పీతో జతకట్టడం గమనార్హం. ఈ మేరకు ఇతర పార్టీల నేతలు తమ రాజకీయ కార్యచరణపై కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. 

మరోవైపు తాము తప్పకుండా విజయం సాధిస్తామని జనతాదల్‌ (జేడీఎస్‌) పార్టీ విశ్వసిస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార్‌ స్వామి తమ గెలుపుపై ఇటీవల ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హంగ్‌ పరిస్థితి తలెత్తినా.. జేడీఎస్‌ మాత్రం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ పార్టీతోగానీ, బీజేపీతోగానీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎందుకంటే కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోదీ హవా లేదని, ఇంకోవైపు కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీల పరస్పర విమర్శలు, అవినీతి ఆరోపణలు తమకు అనుకూలిస్తాయన్న ధీమాతో కొత్త కూటమి తమ వ్యూహాలను రచించనుంది.
     

Advertisement
 
Advertisement
Advertisement