అన్న మాట.. తమ్ముడు తూటా!

JC Brothers Ruling Police Department In Anantapur - Sakshi

పోలీసులపై సవారీ

వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని ఆరోపణలు

మాజీ ఎమ్మెల్యే సూరీడు హత్యలో అప్పటి సీఐ విజయ్‌కుమార్‌పై ఆరోపణలు

ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం డీఎస్పీగా పోస్టింగ్‌

ఇటీవల కాలంలో ప్రతిపక్ష పార్టీ నేతలపై వరుస కేసులు

ఎస్‌ఐగా పని చేసిన స్టేషన్‌కే సీఐ హోదాలో నారాయణరెడ్డి

తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఖూనీ

చేవ లేని పోలీసు శాఖజిల్లా పోలీసులకు చేవ లేకుండా పోతోంది. పోలీసుల తీరు వల్లే శాంతి భద్రతల సమస్య తలెత్తుతోంది. ఫ్రెండ్లీ పోలీసులంటూ నేరస్తులకు కూడా రాచమర్యాదలు చేస్తున్న పరిస్థితి.
– ఈనెల 5న విలేకరుల సమావేశంలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్య

గత ఏడాది డిసెంబర్‌ 21న..
ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అనంతపురం అభివృద్ధికి అడ్డుపడుతున్నారని మేయర్‌ స్వరూప ఆరోపించడంతో ఎమెల్మే జె.సి.ప్రభాకర్‌రెడ్డి అనుచరుడు మడ్డిపల్లి శివరాం నాయుడు మేయర్‌తో పాటు అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరికి ఫోన్‌ చేసి అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో వారిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు శివరాం నాయుడుని అరెస్టు చేసి అనంతపురం త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుడు ఎస్వీ రవీంద్రారెడ్డి అలియాస్‌ పొట్టి రవి మరికొందరితో కలిసి తాడిపత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఎవరో ఏదో కేసు పెట్టారని అరెస్టు చేస్తారా! అంటూ పోలీసులపై చిందులు తొక్కాడు. నా అనుచరున్నే అరెస్టు చేస్తారా? అంటూ అప్పటి సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్‌ఐలపై మండిపడ్డారు. ‘భాస్కర్‌రెడ్డి.. నువ్వు చాలా తమాషాలు చేస్తున్నావ్‌.. నీపద్ధతి ఏం బాగోలేదు.. పని చేయడం చేతకాకపోతే మీరంతా సెలవులో పోండి’’ అంటూ దుర్భాషలాడారు.

అనంతపురం, తాడిపత్రి: తమ్ముడు పోలీసులను బండ బూతులు తిట్టినా.. తన వర్గీయులను వెంటేసుకుని స్టేషన్‌లో భయానక వాతావరణం సృష్టించినా ‘జేసీ కుటుంబం’ కావడంతో మౌనంగా భరించారు. ఇప్పుడేమో అన్న రంగప్రవేశం చేసి చేవలేని పోలీసులని ఏకంగా ఆ వ్యవస్థనే బజారుకీడిస్తే.. చెవులు మూసుకోవడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి. ఇదీ జిల్లాలో జేసీ సోదరుల తీరు. అధికార పార్టీ నేతల చెప్పుచేతల్లో కీలుబొమ్మలుగా మారిన పోలీసులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అక్రమ కేసులకు తెగబడటం విమర్శలకు తావిస్తోంది. ప్రధానంగా తాడిపత్రి సబ్‌ డివిజన్‌లో పరిస్థితి రోజురోజుకూ ఆందోళన కలిగిస్తోంది. తిట్టినా.. కొట్టినా.. పోలీసులు ఒకేవర్గానికి కొమ్ము కాయడం, మరో వర్గం తుమ్మినా, దగ్గినా అక్రమ కేసులు బనాయిస్తుండటం.. గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసులే తిరిగి ఇక్కడ పాగా వేయడం చూస్తే ఎప్పుడు, ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు
ఆగస్టు 16న వైఎస్సార్సీపికి చెందిన ఓబుళరెడ్డి అనే కార్యకర్తను పోలీసులు బైండోవర్‌ చేశారు.
ఆగస్టు 30న యల్లనూరు మండలం తిమ్మంపల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్త రెడ్డి బాషాపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. ఆ సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త పెద్దారెడ్డి ఘటనా స్థలంలో లేకపోయినా ఆయనపై పోలీసులు 307 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.
యల్లనూరు మండలం వెన్నెపూసపల్లి గ్రామంలో వైఎస్సార్సీపి నాయకుడు రాజేశ్వర్‌రెడ్డిపై అధికార పార్టీ నేతల ఆదేశాలతో పోలీసులు కేసు బనాయించారు. రాజేశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉండగా పోలీసులు అక్కడికి వెళ్లిఅరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.
మార్చి 2న జేసీ సోదరుల వర్గీయునికి చెందిన పత్రికా కార్యాలయాన్ని ధ్వంసం చేసిన కేసులో వైఎస్సార్సీపీకి చెందిన నాయకులను ఐదుగురుని పోలీసులు గత బుధవారం రాత్రి అదుపులోకి తీసుకుని బలవంతంగా ఒప్పించి అక్రమ కేసు బనాయించారు. అయితే సంఘటన జరిగిన దాదాపు 8 నెలలకు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేయడం గమనార్హం. అయితే జేసీ దివాకర్‌ బస్సు అద్దాలను ధ్వంసం చేసిన కేసులో అదుపులోకి తీసుకున్న వైఎస్సార్సీపీ నాయకులను.. ఆ కేసుతో పాటు  8నెలల క్రితం పత్రికా కార్యాలయం దగ్ధం చేసిన కేసులో శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌ తరలించారు.
ఆలూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు గోసు రాజగోపాల్‌రెడ్డి ఎస్‌ఐ చొక్కా పట్టుకున్నాడని.. దీంతో పాటు దళితునిపై దాడి చేశాడని ఆ నాయకునిపై అధికార పార్టీ ఒత్తిడితో పోలీసులు నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు.
గత మంగళవారం వైఎస్సార్సీపీకి చెందిన మైనార్టీ నాయకుడు తన సోదరుని వివాహానికి రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ విషయమై వైఎస్సార్సీపీ నేతలు జిల్లా ఎస్పీని కూడా కలిసి పరిస్థితిని వివరించారు. ఇదే నేతపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఆ మైనార్టీ నాయకున్ని అదుపులోకి తీసుకుని క్రికెట్‌ బుకీగా కేసు నమోదు చేశారు. అంతటితో ఆగకుండా పీడీ యాక్టు ప్రయోగించి స్వామి భక్తిని చాటుకున్నారు.

టీడీపీ నేతలపై కేసులంటే భయం
మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు గయాజ్‌బాషా డ్రైవర్‌ జఫ్రూ, అఫ్రోజ్‌ల నివాసాలపై గత బుధవారం రాత్రి టీడీపీ వర్గీయులు రాళ్ల దాడి చేశారు. ఈ విషయమై గయాజ్‌బాషా డీఎస్పీకి ఫిర్యాదు చేస్తే ఎవరో ఆకతాయిలు రాళ్లు వేశారని తేలిగ్గా తీసిపారేశారు.
ఆగస్టు 15న పెద్దారెడ్డిపై సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా పార్టీ ప్రతిష్టకు భంగం కల్గించేలా పోస్టింగులు పెట్టారని జేసీ వర్గీయుడు దాసరి కిరణ్‌పై వైఎస్సారీపీ నేతలు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేస్తే సివిల్‌ కేసుగా పేర్కొంటూ తిరస్కరించారు.
సెప్టెంబర్‌ 2న వైఎస్సార్సీపీ సమన్వకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి సతీమణి రమాదేవిపై సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెట్టడంపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీసం కేసు కూడా నమోదు చేసుకోలేదు.     
సెప్టెంబర్‌ 2న రాత్రి వైఎస్సార్సీపీ నాయకుడు బాషా ఇంటిపై టీడీపీ వర్గీయులు దాడి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందకు వెళ్లగా పోలీసులు స్పందింలేదు.
ఆలూరు గ్రామంలో వైఎస్సార్సీపీ వర్గీయులకు చెందిన దళితులపై పట్టణంలోని నందపాడులో అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు దాడి చేశారు. దీంతో అప్పట్లో వీరిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు కేవలం నామమాత్రపు కేసును నమోదు చేసి చేతులు దులుపుకున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top