ప్రజల కష్టాలు జగన్‌కు తెలుసు

Jayasudha Comments About YS Jagan Mohan Reddy - Sakshi

ఆయన సీఎం అయితే అన్నివర్గాలకు మేలు 

బాబుకు అనుభవం ఉన్నా ఏపీకి ఏమీ చేయలేదు 

చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్‌ పనిచేస్తున్నారు 

హైదరాబాద్‌లో ఆంధ్రా ప్రజలు సంతోషంగా ఉన్నారు 

సినీ నటి, వైఎస్సార్‌సీపీ నాయకురాలు జయసుధ

సాక్షి, అమరావతిబ్యూరో:  రాష్ట్ర ప్రజల కష్టాలేంటో 14 నెలలపాటు 3,648 కి.మీ. పాదయాత్ర చేసిన వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తెలుసని, జగన్‌ సీఎం అయితే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని సినీ నటి, వైఎస్సార్‌సీపీ నాయకురాలు జయసుధ తెలిపారు. ఆదివారం విజయవాడలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీలో చేరానన్నారు. పార్టీలో చేరడంతో సొంతగూటికి వచ్చినట్టుందన్నారు.

వైఎస్సార్‌ చనిపోయాక జగన్‌ ఎంత కష్టపడ్డారో చూశానని, అతన్ని ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టినా వెనకడుగు వేయలేదని, నమ్మకం కోల్పోలేదని తెలిపారు. వైఎస్సార్‌లా పాదయాత్ర చేసి వైఎస్‌ జగన్‌ ప్రజల కష్టాలు తెలుసుకున్నారని, ప్రజలు కూడా జగన్‌ సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. వైఎస్‌ జగన్‌ మాటమీద నిలబడే వ్యక్తి అనితెలిపారు. అందుకు ఆయన ప్రకటించిన నవరత్నాలే నిదర్శనమన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఈ పథకాలు ఉపయోగపడతాయని చెప్పారు. అందుకోసం జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.  

అనుభవమున్న సీఎం ఏమీ చేయలేదు 
‘నలభై ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయారు. పదేళ్లుగా ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ.. ప్రజల మధ్యే ఉంటూ జగన్‌.. ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే ఎక్కువ అనుభవం గడించారని, జగన్‌ను సీఎం చేయడానికి ఇదే సరైన సమయమని అన్నారు. సినీ పరిశ్రమకు వైఎస్సార్‌ ఎంతో మేలు చేశారని, అందుకే ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌ అంటే సినీ పరిశ్రమలో ఉన్న వారందరికి అభిమానమన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ఆయనకు అండగా సినీ పరిశ్రమలో ఉన్న 80 శాతం మంది నిలిచారని చెప్పారు. 

చంద్రబాబును పవన్‌ అనుసరిస్తున్నారు..
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చెప్పినట్లుగా హైదరాబాద్‌లో ఆంధ్ర ప్రజలు ఎటువంటి ఇక్కట్లు పడలేదని, అందరూ సంతోషంగా ఉన్నారని జయసుధ తెలిపారు. పవన్‌ చెప్పినవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. పవన్‌ ఎప్పుడూ చంద్రబాబును అనుసరిస్తుంటారని, అందుకే బాబు మాదిరిగానే జగన్‌పై పవన్‌కల్యాణ్‌ ఆరోపణలు చేస్తున్నారని జయసుధ విమర్శించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top