ఓటు గుట్టు తెలిస్తే ఏమవుతుంది?

Indian Ballot Is No Longer Secret - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌ లోక్‌సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న మేనకా గాంధీ సోమవారం పిలిభిత్‌ జిల్లా వాసులతో మాట్లాడుతూ తనకు వచ్చిన ఓట్ల ప్రాతిపదికన ఆయా ప్రాంతాలను ఏబీసీడీలుగా విభజించి అభివద్ధి కార్యక్రమాలను అమలు చేస్తానని హెచ్చరించిన విషయం తెల్సిందే. అంటే, ఎక్కువ ఓట్లు వచ్చిన ప్రాంతాలను ‘ఏ’ కేటగిరీగా తక్కువ ఓట్లు వచ్చిన ప్రాంతాలను ‘డీ’ కేటగిరీలుగా విభజిస్తానని చెప్పడం. అంతకుముందు వారం ఆమె ముస్లిం ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ తనకు ఓట్లేస్తేనే ముస్లిం బాగోగులు గురించి చూస్తనని హెచ్చరించడమే కాకుండా, ఏ యాభై, వందో ఓట్లేసి పనుల కోసం తన దగ్గరికొస్తే అప్పుడు వారి పని చెబుతానని కూడా హెచ్చరించారు.

ఆమె హెచ్చరికల వెనకనున్న ఉచితానుచితాలను, తప్పొప్పులను ప్రస్తుతానికి పక్కన పెడితే ఏ ప్రాంతంలో ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి ఓట్లు వేశారనే విషయం బయటకు తెలియడం వల్ల ఎంత ముప్పుందో, ఓటు గుట్టును గుట్టుగా ఉంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఎంత అవసరమో చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1951లోని ప్రజా ప్రాతినిథ్య చట్టం ఓటును గోప్యంగా ఉంచేందుకు గ్యారంటీగా ‘రహస్య బ్యాలెట్‌’ విధానాన్ని తీసుకొచ్చింది. రహస్య బ్యాలెట్‌ నిర్వహించినప్పటికీ గ్రామాల్లో లేదా చిన్న, చిన్న బూతుల్లో ఏ అభ్యర్థికి ఓటు వేశారన్న విషయం తెలిసిపోతుండడంతో, ఓ ప్రాంతం, ఓ బ్లాక్‌ నుంచి తీసుకొచ్చిన పోలింగ్‌ డబ్బాలన్నింటిని ఓ చోట చేర్చి వాటిలోని ఓట్లను మిశ్రమం చేసి లెక్కించాలని ప్రజాప్రాతినిధ్య చట్టానికి 1961లో ఓ సవరణ తీసుకొచ్చారు. అంటే ఏ ప్రాంతంలో ఏ అభ్యర్థికి ఎక్కువ లేదా తక్కువ ఓట్లు వచ్చాయో తెలుసుకునే అవకాశం లేకుండా ఉండాలన్న ఉద్దేశమే సవరణ లక్ష్యం. ఈ విధానం 2009 వరకు కొనసాగింది. 


ఈవీఎంల ప్రవేశంతో సీన్‌ మారింది!
2009 ఎన్నికల నుంచి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల(ఈవీఎం)ను ప్రవేశపెట్టడం ద్వారా ఓటు గోప్యత తగ్గుతూ వచ్చింది. సాధారణంగా వెయ్యి నుంచి 1500 ఓటర్లకు ఒక ఈవీఎంను ఏర్పాటు చేస్తారు. అయితే ఒక్కో ఈవీఎంలో 200 నుంచి 600 వరకు ఓట్లు నమోదు అవుతున్నాయి. భారత ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ప్రకారం ప్రతి పోలింగ్‌ అధికారి ‘ఫామ్‌20’ నింపాలి. పోలింగ్‌ కేంద్రంలో ఎన్ని ఈవీఎంలు ఉపయోగించారో, ఒక్కో ఈవీఎంలో ఎన్ని ఓట్లు పడ్డాయో ఆ ఫామ్‌లో తెలియజేయాలి. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏ ప్రాంతం, ఏ పోలింగ్‌ బూత్, ఏ ఈవీఎంలో అభ్యర్థులకు ఎలా వచ్చాయో తెలిసిపోతుంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద, పార్టీల వద్ద పోలింగ్‌ కేంద్రం ప్రాతిపదికన చిరునామాలతో సహా ఓటర్ల జాబితా లభిస్తుంది. ఆ జాబితా ఆధారంగా ఏ కులస్థులు, ఏ మతస్థులు, పురుషులు లేదా మహిళలు ఎవరికి ఓటు వేశారో సులభంగానే తెలుసుకోవచ్చు. ఓటర్ల జాబితాలో కుల, మతాల ప్రస్థావన ఉండకపోయినా రాజకీయ పార్టీలు సమకూర్చుకున్న డేటాలో ఆ వివరాలు ఉంటున్నాయి. చిన్న పోలింగ్‌ కేంద్రాలలో ఎవరు, ఎవరికి ఓటు వేశారో ఇంకా సులువుగా తెలుసుకోవచ్చు. 

ఎప్పుడూ బీజేపీకే ఆ ఓటు 
గుజరాత్‌లోని గిరి అడవుల్లో బనేజ్‌ తండాలో ఒకే ఒక ఓటరు ఉన్నారు. భరత్‌దాస్‌ దర్శన్‌దాస్‌ అనే 55 ఏళ్ల ఆ ఓటరు గత కొన్ని పర్యాయాలుగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే ఓటు వేస్తున్నారు. అలాగే అరుణాచల్‌ ప్రదేశ్‌లోని మాలేగామ్‌ పర్వతాల్లో సొకేలా తయాంగ్‌ అనే 39 ఏళ్ల ఏకైక ఓటరు కోసం ప్రత్యేక పోలీంగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏప్రిల్‌ 11వ తేదీన ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపున ఆమె ఎవరికి ఓటు వేశారో సులభంగా తెలిసి పోతుంది. (చదవండి: ఒక్క ఓటు కోసం ఆరుగురు సిబ్బంది)

అమిత్‌ షా ఆదేశాలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీదున్న వ్యతిరేకతను ఎదుర్కోవడానికి వీలుగా కేంద్ర సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న దేశంలోని 22 కోట్ల మందిని ప్రత్యక్షంగా కలుసుకొని ఓట్లను కోరాల్సిందిగా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఇటీవల పార్టీ కార్యకర్తలను ఆదేశించారు. నేటి డిజిటల్‌ యుగంలో లబ్ధిదారుల్లో ఓటర్లను గుర్తించడం కష్టం కాదు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ‘సేవామిత్ర’ యాప్‌ ద్వారా ఓటర్లలో ప్రభుత్వ లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రయత్నించిన విషయం తెల్సిందే.

తీవ్రమైన పర్యవసనాలు
ఏ ఓటరు ఎవరికి ఓటు వేశారో తెలిసిపోతే తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయి. మేనకా గాంధీ హెచ్చరించినట్లు ఓటు వేయని వారిపై కక్ష సాధించవచ్చు. వారికి ఎలాంటి ప్రభుత్వ సాయం అందకుండా చేయవచ్చు. ఇంకేమైనా చేయవచ్చు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం జేడీయూ కార్యకర్తలు నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తమ పార్టీ అభ్యర్థికి ఎందుకు ఓటు వేయలేదంటూ ఓ ప్రాంతం ఓటర్లను చితక బాదారు. ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా పునరావతం కావచ్చు!

పరిష్కారం ఏమిటీ ?
ఈవీఎంలను ప్రవేశపెట్టడానికి ముందు నుంచే, అంటే 2008 నుంచి ఈవీఎంలను విడివిడిగా కాకుండా కలిపి లెక్కించేందుకు వాటికి ‘టోటలైజర్‌’ను అనుసంధించాలనే డిమాండ్‌ వస్తోంది. బూత్‌ స్థాయిలో 14 ఈవీఎంలకు ఒక టోటలైజర్‌ను అనుసంధానించవచ్చని కూడా నిపుణులు తేల్చారు. టోటలైజర్‌ ఓట్ల లెక్కింపును ‘క్లస్టర్‌ కౌంటింగ్‌’ అని కూడా వ్యవహరిస్తారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఈ విధానాన్ని అమలుకు ప్రతిపాదించగా 2017లో బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకించింది. దీని వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని ఉన్నత స్థాయి కమిటీ ద్వారా తేలిందని  సుప్రీం కోర్టు ముందు వాదించింది. అలా తేల్చిన కమిటీ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీల కమిటీ. ఇదే విషయమై 2018లో క్లస్టర్‌ కౌంటింగ్‌ కోసం ఓ ఎన్జీవో సంస్థ సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేయగా, విచారించకుండానే కోర్టు దాన్ని కొట్టివేసింది. యాభై శాతం ఓటింగ్‌ యంత్రాలకు ఓటర్‌ వెరీఫైయింగ్‌ (వీవీపీఏటీ) స్లిప్‌లు ఉండాలని డిమాండ్‌ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేస్తామంటూ ఆదివారం నాడు ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి. వాటికన్నా కూడా ఈ ‘క్లస్టర్‌ కౌంటింగ్‌’ అత్యవసరం. ఈ ఎన్నికలకు క్లస్టర్‌ కౌంటింగ్‌ సాధ్యం కాదు కనుక, ‘ఫొమ్‌ 20’ నింపకుండానైనా చూడాలి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top