సీఈవో చెప్పాల్సిన అవసరం ఉంది

High Court opinion on the implementation of election guarantees - Sakshi

ఎన్నికల హామీల అమలు సాధ్యాసాధ్యాలపై హైకోర్టు అభిప్రాయం

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు అమలు చేయడం సాధ్యమా?కాదా? అన్న విషయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) చెప్పాల్సిన అవసరం ఉందని ఉమ్మడి హైకోర్టు అభిప్రాయపడింది. వచ్చే నెల జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయా రాజకీయ పార్టీలు సమర్పించిన మేనిఫెస్టోలపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియచేయాలని హైకోర్టు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన వివరాలను తమ ముందుంచాలంటూ విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆయా రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీల అమలుకు వాటినే బాధ్యులుగా చేసేందుకు తగిన చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ ఎం.నారాయణాచార్యులు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం సోమవారం దానిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎ.గోపాలరావు వాదనలు వినిపిస్తూ, రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీల సాధ్యాసాధ్యాలపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఓ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుందన్నారు.

వారు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు నిధులను ఎక్కడి నుంచి తీసుకువస్తారో చెప్పాల్సిన బాధ్యత ఆయా రాజకీయ పార్టీలపై ఉందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, హామీలను ఆయా పార్టీలు అమలు చేయగలవా? లేదా? అన్నది ఎన్నికల ప్రధాన అధికారి చెప్పాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ప్రతి వ్యక్తికీ ఓ ఇల్లు ఇస్తామని రాజకీయ పార్టీలు హామీ ఇస్తే, ఆ హామీ అమలు సాధ్యమేనా? అందుకు నిధులు ఎలా సమకూరుతాయి? వంటి అంశాలపై ప్రధాన ఎన్నికల అధికారి తన అభిప్రాయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లవచ్చునంది.

ఈ వ్యాజ్యాన్ని పెండింగ్‌లో ఉంచుతామని, దీని వల్ల ఎన్నికల సంఘం కొంచెం మెరుగ్గా పనిచేసే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించింది. అంతకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ, తమకు ఇప్పటివరకు ఆరు రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలను సమర్పించాయన్నారు. ఎన్నికల ప్రచార గడువు ముగిసే రోజు వరకు మేనిఫెస్టోలు సమర్పించేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఆ మేనిఫెస్టోలపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియచేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top