రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశం: జీవీఎల్‌

GVL Narasimha Rao Comments On Amaravati - Sakshi

న్యూఢిల్లీ : చంద్రబాబు ప్రభుత్వం అమరావతి భవ్యంగా నిర్మించామని చెప్పుకోవడంలో అర్థం లేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. స్విస్, సింగపూర్ చాలెంజ్ పేరుతో రాజధాని నిర్మాణం పేరిట వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధుల్లో కొద్దిగా ఖర్చుపెట్టి మిగతా మొత్తం జేబులో వేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై జీవీఎల్‌ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం..కేంద్ర ప్రభుత్వం సూచనలతో చేసేది కాదని పేర్కొన్నారు.

గతంలో చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన రెండు వేల కోట్ల రూపాయలతో కేవలం తాత్కాలిక భవనాలకే రాజధానిని పరిమితం చేసిందని విమర్శించారు. అమరావతి నిర్మాణానికి 5 వేల ఎకరాలు సరిపోతాయని.. అయితే అవసరానికి మించి అమరావతిలో భూమిని సేకరించారని ఆరోపించారు. చదరపు అడుగుకు పదివేల రూపాయలు ఖర్చుచేసి ప్రజాధనాన్ని లూటీ చేశారని గత ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ప్రస్తుతం అమరావతి తరలిపోతుంది అంటూ కొంతమంది లేనిపోని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాధనం లూటీకి సంబంధించి ప్రభుత్వం వద్ద అనేక ఆధారాలు ఉన్నాయని.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

‘రాజధాని నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. కేంద్ర ప్రభుత్వం సూచనలతో చేసేది కాదు. అమరావతి పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. అమరావతిపై పలు వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏమిటన్నది ప్రభుత్వం చెప్పాలి. భవనాల నిర్మాణం పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసింది. కంపెనీలకు వ్యక్తులకు చౌక ధరకు పెద్ద ఎత్తున రైతుల భూములను కట్టబెట్టారు. అంతేకాదు గత ప్రభుత్వం హయాంలోనే పోలవరంలో అవినీతి జరిగింది. 5800 కోట్ల హెడ్ వర్క్స్ పనులను మూడు కంపెనీలకు ఇచ్చారు. ఇందులో భాగంగా 2346 కోట్ల రూపాయలు హెడ్ వర్క్స్ పనుల్లో అధికంగా చెల్లించారని నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది.

ఎవరు చెబితే అధిక చెల్లింపులు చేశారో బయటికి చెప్పాలి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్టర్లు అందరికీ ముందుగానే చెల్లింపులను పూర్తి చేశారు. గత ప్రభుత్వం సమయంలో అనేక అక్రమాలు జరిగాయి. అవినీతి, అక్రమాలు జరిగినచోట చర్యలు తీసుకోవాలి. పరిశ్రమలో భూములు తమ అస్మదీయులకు చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టింది. వేలాది కోట్లు దుర్వినియోగం చేసింది’ అని జీవీఎల్‌ టీడీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ‘ప్రజా ప్రయోజనం కోసం విచారణ జరగాలి. రాజధాని భూములలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నది బహిరంగ రహస్యం. అయితే ఎలా జరిగిందన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టాలి’ అని డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top