
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలు విజయవాడ వేదికగా సమావేశమయ్యారు అయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ-జనసేనా కలిసి పోటీచేయాలని నిర్ణయించినట్లు భేటీ అనంతరం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. బీజేపీ బలంగా ఉన్న స్థానాలు మీద చర్చించామని, సరైన అభ్యర్థులను బరిలో నిలపుతామని తెలిపారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై జనసేన నాయకులతో చర్చలు జరుపుతామన్నారు. ఇరు పార్టీల సమన్వయంతో అభ్యర్థులను నిర్ణయిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపల్ పోరులోనూ జనసేన, బీజేపీ ఉమ్మడిగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తాయని తెలిపారు. కాగా బీజేపీ-జనసేన మధ్య ఢిల్లీ వేదికగా ఇటీవల పొత్తు కుదిరిన విషయం తెలిసిందే.
కాగా అంతకుముందే స్థానిక సంస్థల ఎన్నికలపై విజయవాడలో బీజేపీ-జనసేన నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీట్లు సర్దుబాటు, ఉమ్మడి మ్యానిఫెస్టోపై ప్రధాన చర్చ జరిగినట్లు సమచారం. ఈ కార్యక్రమానికి బీజేపీ నుంచి జీ. సతీష్, కేంద్ర మాజీమంత్రి పురంధరేశ్వరి, సోము వీర్రాజు, మాధవ్, కామినేని పాల్గొన్నారు. జనసేన నుండి నాదెండ్ల మనోహర్‌తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.