ఆలయాలకు కోట్ల సంపద ఉండి ఏం ఉపయోగం?

Gold, Wealth of Kerala Temples Can Help Rebuild Flood-Hit State - Sakshi

బీజేపీ ఎంపీ ఉదిత్‌ రాజ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: వరద బీభత్సంతో ధ్వంసమైన కేరళను పునర్‌నిర్మించేందుకు ఆ రాష్ట్రంలోని మూడు ప్రధానమైన ఆలయాల బంగారం, సంపదను వినియోగించాలని వాయవ్య ఢిల్లీ బీజేపీ ఎంపీ ఉదిత్‌ రాజ్‌ సలహా ఇచ్చారు. కేరళలోని పద్మనాభ స్వామి, శబరిమల, గురువాయూర్‌ ఆలయాల అధీనంలోని బంగారం, ఆస్తులను కలిపితే దాదాపు రూ.1లక్ష కోట్లకుపైగా ఉంటుందని, కేరళకు జరిగిన రూ.20వేల కోట్లకంటే ఈ మొత్తం చాలా ఎక్కువని ఆయన లెక్కకట్టారు. ‘ఓ వైపు జనం ఆర్తనాదాలు చేస్తూ చస్తుంటే, మరోవైపు ఆలయాలకు రూ.లక్ష కోట్ల సంపద ఉండి ఏం ఉపయోగం?’ అంటూ ఉదిత్‌ ట్వీట్‌ చేశారు.

ఆలయాల సంపదను వాడాలన్న తమ డిమాండ్‌కు ప్రజలు మద్దతు పలకాలని ఆయన కోరారు. భారీ వర్షాలు, వరదల కారణంగా గత నెలలో కేరళలో 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అక్కడ భారీఎత్తున పునర్‌నిర్మాణపనులు జరుగుతున్నాయి. కేరళకు తక్షణసాయంగా ప్రధాని మోదీ రూ.600 కోట్లు మంజూరుచేయగా, పలు రాష్ట్రాలు, సంస్థలు, లక్షలాది మంది ప్రజలు తమ వంతు సాయమందించారు. రూ.20వేల కోట్ల నష్టం జరిగిందని, కనీసం రూ.2,000 కోట్ల సాయం చేయాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కేంద్రాన్ని కోరడం తెల్సిందే.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top