ముగిసిన మూడో విడత పోలింగ్‌

General Elections Third Phase Polling Completed - Sakshi

న్యూఢిల్లీ: మూడో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ కొద్దిసేపటి క్రితం ముగిసింది. మంగళవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది. అయితే ఆరు గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న వారందరికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహ.. 14 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 116 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం పోలింగ్‌ నాలుగు గంటలకే ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 61.31 శాతం పోలింగ్‌ నమైదయింది.116 పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో ఈసీ మొత్తం 2.10 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేసింది. నేడు జరిగిన పోలింగ్‌లో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్‌ యాదవ్, ఎస్పీ నేత ఆజంఖాన్, బీజేపీ నేత జయప్రదల భవిత్యం ఈవీఎంలలో నిక్షిప్తం అయింది.

ప్రధాని నరేంద్ర మోదీ తన తల్లి ఆశీర్వాదం తీసుకున్న అనంతరం అహ్మదాబాద్‌లో ఓటు వేశారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా,  ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ,  గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లిఖార్జున ఖర్గే, సమాజ్‌వాది పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌, ఆయన సతీమణి డింపుల్‌ యాదవ్‌, గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని, సామాజిక కార్యకర్త అన్నాహజారే, ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే తదితర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సాయంత్ర 5 గంటల వరకు రాష్ట్రాల వారీగా పోలింగ్‌..
అస్సాం- 74.05 శాతం
బిహార్‌- 54.95 శాతం
ఛత్తీస్‌గఢ్‌- 64.03 శాతం
గోవా- 70.96 శాతం
గుజరాత్‌- 58.81 శాతం
జమ్మూ కశ్మీర్‌- 12.46 శాతం
కర్ణాటక- 60.87 శాతం
కేరళ- 68.62 శాతం
మహారాష్ట్ర- 55.05 శాతం
ఒడిశా- 57.84 శాతం
త్రిపుర- 71.13 శాతం
ఉత్తరప్రదేశ్‌- 56.36 శాతం
పశ్చిమ బెంగాల్‌- 78.94 శాతం
దాద్రానగర్‌ హవేలీ- 71.43 శాతం
డామన్‌డయ్యూ- 65.34 శాతం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top