చంద్రగిరిలో పోటీ చేయను !

Galla Aruna Kumari Not In Chandragiri Race Chittoor - Sakshi

మరోసారి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి స్పష్టం

సన్మాన కార్యక్రమానికి దూరంగా సీనియర్‌ నేతలు

తిరుపతి రూరల్‌: తాను ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నానని, రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయడం లేదని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి మరోసారి స్పష్టం చేశారు. తాను చంద్రగిరి నుంచి పోటీ చేస్తాననే ఆశలు వదులుకోవాలని కార్యకర్తలకు సూచించారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా నియమితులైన సందర్భంగా చంద్రగిరిలోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం ఆమెను ఆ పార్టీ నేతలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రగిరి నుంచి తాను పోటీ చేయనని గతంలో ముఖ్యమంత్రికి తేల్చి చెప్పానని మరోసారి గుర్తు చేశారు.

రోడ్డుపైన ప్రసంగంతో భారీగా ట్రాఫిక్‌జామ్‌..
గల్లా అరుణకుమారి ర్యాలీగా వచ్చి కల్యాణమండపంలో ప్రసంగించాల్సి ఉన్నా, పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపైనే వాహనం నిలిపి రోడ్డునే బహిరంగ సభ వేదికగా మార్చుకున్నారు. దీంతో వందలాది వాహనాలు బైపాస్‌ రోడ్డుపై ఆగిపోయాయి. రెండు గంటల పాటు భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. పట్టించుకోవాల్సిన పోలీసులు గల్లా అరుణ చుట్టూ చేరి భజనలు చేయడానికే పరిమితం అయ్యారని, ట్రాఫిక్‌ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రయాణికులు మండిపడ్డారు. ఓ దశలో పోలీసులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. చివరకు ఆమె ప్రసంగం సాగుతుండగానే భారీ వాహనాలను ఓ వైపు వదిలారు. సన్మాన వేదిక వద్ద తోపులాటలతో నేతలు, కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

దూరంగా సీనియర్లు..
పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా నియమితులైన సందర్భంగా గల్లా అరుణకుమారికి సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని సీనియర్‌ నేతలు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా చంద్రగిరికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రమేష్‌రెడ్డి, శ్రీహరినాయుడు, మాజీ ఎంపీపీ లోకయ్యనాయుడు, వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన జెడ్పీటీసీ సభ్యురాలు సరిత, ఆమె భర్త రమణమూర్తి, వలపల దశరథనాయుడు తదితరులు హాజరుకాలేదు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, పార్టీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, జెడ్పీ చైర్మన్‌ గీర్వాణి, చంద్రప్రకాష్, పుష్పవతి, సుబ్రమణ్యంనాయుడు, జనార్దన్‌యాదవ్, కుర్రకాల్వ సుభాషిణి, సుధాకర్, బడి సుధాయాదవ్, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top