కేసీఆర్‌పై గద్దర్‌ పోటీ..!

IS Gaddar Contest Against KCR In Gajwel - Sakshi

స్వతంత్రంగానే బరిలోకి

రాహుల్‌ సూచన మేరకే పోటీ 

కూటమి నుంచి అభ్యర్థులు ఉండరని రాహుల్‌ భరోసా 

సాక్షి, న్యూఢిల్లీ: ప్రజా గాయకుడు గద్దర్‌ అసెంబ్లీ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమ లక్ష్యాలపై చర్చించేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలిశామని గద్దర్‌ చెప్పినా.. సమావేశంలో రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కొనేందుకు శక్తులను కూడగట్టే దిశగా సహకారం కోరేందుకు గద్దర్‌ను రాహుల్‌ స్వయంగా ఢిల్లీకి పిలిపించినట్లు సమాచారం. భావసారూప్యత దృష్ట్యా లౌకిక శక్తులకు సానుకూలంగా పనిచేయడం ద్వారా ఇరువురి లక్ష్యాలు అందుకోవచ్చని రాహుల్‌ పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని రాహుల్‌ కోరినా గద్దర్‌ సున్నితంగా తిరస్కరించారు. కేసీఆర్‌కు, అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల బరిలోకి గద్దర్‌ దిగితే కాంగ్రెస్‌కు కలిసి వస్తుందని, అందువల్ల కనీసం స్వతంత్రంగానైనా పోటీ చేయాలని రాహుల్‌ కోరినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు గద్దర్‌ కొన్ని షరతులతో సమ్మతించినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌పై గానీ, మరేదైనా కీలక స్థానంలో గానీ స్వతంత్రంగా పోటీ చేస్తానని, మహా కూటమి నుంచి అభ్యర్థులను ఎవరినీ నిలపొద్దని గద్దర్‌ కోరినట్లు సమాచారం. దీనిపై రాహుల్‌ కూడా భరోసా ఇచ్చారని తెలుస్తోంది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top