ఆమంచిపై తీవ్ర వ్యతిరేకత | fisher families complaint against amanchi krishnamohan | Sakshi
Sakshi News home page

ఆమంచిపై తీవ్ర వ్యతిరేకత

Oct 18 2017 12:31 PM | Updated on Mar 21 2019 8:30 PM

fisher families complaint against amanchi krishnamohan - Sakshi

చీరాల: చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ నేనే రాజు.. నేనే మంత్రి అన్న చందాన వ్యవహరించడంపై చారిత్రాత్మక గ్రామమైన చీరాల వాడరేవులోని మత్స్యకారులు అడ్డం తిరిగారు. అభివృద్ధి పేరుతో ముందస్తుగానే సోమవారం తమ గుడిసెల తొలగించడంపై మత్స్యకార మహిళలు మండిపడుతున్నారు.

ఆమంచి తీరుతో తమ జీవనోపాధితో పాటు తలదాచుకుంటున్న గుడిసెలు కోల్పోతుండటంతో చావుకైనా సిద్ధపడతామని, అంతేగానీ, తమ గుడిసెలు తొలగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని బాధిత మత్స్యకారులు స్పష్టం చేస్తున్నారు. మత్స్యకార సంఘాల నాయకులు, ప్రజా సంఘాలు, వైఎస్సార్‌ సీపీ నేతలు మత్స్యకారులకు అండగా నిలిచారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల అత్యుత్సాహాన్ని నిలువరించిన మత్స్యకారులు మంగళవారం ఒంగోలు చేరుకుని కలెక్టర్, ఎస్పీలను కలిసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. తమను ఆదుకోవాలని కోరుతూ కలెక్టర్‌ వినయ్‌చంద్‌ను ఆ గ్రామసర్పంచ్‌ ఎరిపిల్లి రమణ, నాయకులు గాలి, బాబీలు, సూరిబాబు, సీపీఎం నాయకులు వసంతరావు, జిల్లా మత్స్యకార సంఘాల నాయకులు వినతిపత్రం అందించారు.

ప్రజాభీష్టం మేరకే పనులు చేయాలి : అభివృద్ధి అనేది ప్రజల అభీష్టం మేరకే చేస్తే బావుంటుంది. 150 కుటుంబాలు నివసించే ప్రాంతాన్ని కేవలం పర్యాటక అభివృద్ధి కోసం ఖాళీ చేయించాలని చూడటం గర్హనీయం. తామంతా వేట, చేపల అమ్మకంతోనే బతుకుతున్నాం. కానీ, పర్యాటక అభివృద్ధి పేరుతో ఉన్నపళంగా మత్స్యకారులు ఉంటున్న ప్రాంతాలను ఖాళీ చేయాలని చూస్తే ఊరుకునే స్థితిలో మా మత్స్యకారులు లేరు. మాకు ప్రత్యామ్నాయం చూపించి కొంత సమయం ఇచ్చి పనులు చేయాలేగానీ, పర్యాటకానికి సంబంధించి ఎలాంటి నిధులు, ప్రకటనలు చేయకుండా, పాలకవర్గ తీర్మానాలు లేకుండా మత్స్యకారుల గుడిసెలను కూల్చివేస్తే ఉద్యమాలు చేస్తాం. అధికార పార్టీ అయినా అందరి అభీష్టంతో పనిచేస్తాం.
– ఎరిపిల్లి రమణ, సర్పంచ్, వాడరేవు

  ఒంగోలులో కలెక్టర్‌ వినయ్‌చంద్‌కు వినతిపత్రం ఇస్తున్న వాడరేవు సర్పంచ్, మత్స్యకార సంఘ నాయకులు, చిన్నబరప వద్ద చించివేసిన ఆమంచి ఫ్లెక్సీ
ఆమంచి ఫ్లెక్సీలు ధ్వంసం...
చీరాలటౌన్‌: చీరాల ఎమ్మెల్యే ఆమంచి ఫ్లెక్సీల చించివేత, ధ్వంసం కార్యక్రమాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వారం రోజుల క్రితం ఈపూరుపాలెంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమంచి ఫ్లెక్సీలు చించివేసిన ఘటన తర్వాత మళ్లీ వాడరేవులో ఫ్లెక్సీల రగడ చోటు చేసుకుంది. దీంతో మండలంలోని వాడరేవులో ఇటీవల ఇంటింటికి టీడీపీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన 15 ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం చించివేశారు. పాకలలో పూరి గుడిసెల తొలగింపు ప్రయత్నాల నేపథ్యంలో గ్రామంలో ఏర్పాటు చేసిన ఆమంచి ఫ్లెక్సీల ధ్వంసంతో గ్రామంలో మరో అలజడి ఏర్పడింది. చించివేసిన ఫ్లెక్సీలను హుటాహుటిన పంచాయతీ సిబ్బంది తొలగించారు.

అభివృద్ధి పేరుతో అరాచకం చేస్తారా.?– మత్స్యకార కుటుంబాలకు అఖిలపక్షం భరోసా
చీరాల అర్బన్‌: అభివృద్ధి పేరుతో అరాచకం సృష్టించి మత్స్యకారులను భయభ్రాంతులకు గురిచేయడం ఏమిటని ఎమ్మెల్యే ఆమంచిని అఖిలపక్షం నాయకులు ప్రశ్నించారు. మంగళవారం వాడరేవులో పర్యటించి బాధిత మత్స్యకారులతో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ సీపీ బాపట్ల పార్లమెంటరీ ఇన్‌చార్జి డాక్టర్‌ వి.అమృతపాణి మాట్లాడుతూ సముద్రంపై వేటసాగిస్తూ జీవిస్తున్న సుమారు 200 మంది మత్స్యకార కుటుంబాలకు చెందిన గుడిసెలను బలవంతంగా తీసివేయడం దారుణమన్నారు. వాడరేవులో టూరిజం అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ చేస్తున్న ప్రయత్నాలను వారు తీవ్రంగా ఖండించారు. రెవెన్యూ అధికారులు, పోలీసులను ఉపయోగించుకుని ఇష్టానుసారంగా వ్యవహరించడం హేయమైన చర్యని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బలహీనవర్గాల సమాఖ్య కార్యదర్శి గోసాల ఆశీర్వాదం, దళిత గిరిజన ఫ్రంట్‌ కన్వీనర్‌ పులిపాటి బాబూరావు, ఎరుకుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ఎన్‌.మోహన్‌కుమార్‌ ధర్మా, వైఎస్‌ఆర్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు బి.జైసన్‌బాబు, ఎస్సీసెల్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పేర్లి నాని, పార్టీ అధికార ప్రతినిధి దేవరపల్లి బాబూరావు, బీఎస్పీ, మత్స్యకార సంఘ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement