
దేశంలో అంతర్యుద్ధం.. రక్తపాతం తప్పదంటూ...
గువాహటి: టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మరో ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. ఎన్‌ఆర్‌సీ డ్రాఫ్ట్ నేపథ్యంలో ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో ‘రక్తపాతం, అంతర్యుద్ధం తప్పదంటూ’ ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు వ్యతిరేకంగా అసోంలో ఇప్పటిదాకా ఐదు ఫిర్యాదులు అందగా.. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ప్రసంగాల ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టే మమత యత్నించారని పలువురు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.
ఇంతకు ముందు గీతానగర్, గోలాఘట్, జాగిరోడ్ స్టేషన్‌లలో కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. మైనార్టీలకు వ్యతిరేకంగా కుట్ర పన్నే బీజేపీ డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసిందని, వారికి పౌరసత్వం దక్కనీయకుండా చేసి 2019 ఎన్నికల్లో లాభపడేందుకు యత్నిస్తోందని మమత విమర్శలు గుప్పించారు. అసోంలో జూలై 30న పౌరసత్వానికి సంబంధించిన ఎన్‌ఆర్‌సీ చివరి డ్రాఫ్ట్ పేరిట ప్రభుత్వం విడుదల చేయగా.. 3.29 కోట్ల మందికిగానూ 2.89 కోట్ల ప్రజలకు పౌరసత్వం లభించింది. దీంతో 40 లక్షల మంది పరిస్థితి అగమ్యగోచరంగా తయారవ్వగా.. ప్రభుత్వం భరోసా ఇచ్చేందుకు ప్రకటనలు ఇస్తోంది.