ఇంటికో ఉద్యోగం ఇచ్చేవరకు పోరాటం: ఆర్‌.కృష్ణయ్య 

fight till the job to every one says Krishnaiah - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి ఇచ్చేవరకు పోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని చైతన్యపురిలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ నీల వెంకటేశ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహాగర్జన కార్యక్రమం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఖాళీ అయితే 6 నెలల్లోపు భర్తీ చేసినట్లే ఉద్యోగ ఖాళీలు ఏర్పడితే 3 నెలల్లోపు భర్తీ చేసేలా రాజ్యాంగాన్ని సవరించి చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు.

ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికొక ఉద్యోగం వస్తుందని ప్రతి సభలో కేసీఆర్‌ చెప్పారని, తీరా అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా 10 వేల మందికీ ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపించారు. ఈ సమావేశంలో నీల వెంకటేశ్, గుజ్జ కృష్ణ, నందగోపాల్, రామలింగం, వేముల రామకృష్ణ, రావుల కోల్‌ నరేశ్, గంగనబోయిన రాంబాబు, పి.సతీశ్, సుమారు 5 వేల మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top