‘ఆ నివేదికను పార్లమెంట్‌లో పెట్టాలి’

శ్రీనగర్‌ : కశ్మీర్‌ చర్చలపై కేంద్రం నియమించిన ప్రత్యేక ప్రతినిధి దినేశ్వర్‌ శర్మపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ చర్చలపై కేంద్ర ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదిక పార్లమెంట్‌లో వెలుగుచూస్తేనే ఆయన విజయం సాధించినట్లని అబ్దుల్లా అభిప్రాయపడ్డారు.

‘కశ్మీర్‌ చర్చలకు సంబంధించి దినేశ్వర్‌ శర్మను ప్రత్యేక ప్రతినిధిగా నియమించడంలో కేంద్రం ఆంతర్యమేమిటో ప్రభుత్వ పెద్దలు ప్రజలకు వివరణ ఇవ్వాల్సి ఉంది. చర్చలు మొదలు కాకముందే ఆయన పాత్రను నామమాత్రం చేసేందుకు ప్రభుత్వమే వివిధ రకాల వాదనలను లేవనెత్తుతోంది. కశ్మీర్‌పై నేనెప్పుడూ చర్చలకు సిద్ధమే..అయితే చర్చలపై నాకున్న అభ్యంతరమల్లా కేంద్రం అనుసరిస్తోన్న అస్పష్ట వైఖరితోనే. కశ్మీర్‌పై శర్మకున్న స్పష్టత ఏమిటో ఎవరికీ అంతు చిక్కడంలేదు. కశ్మీర్‌పై ఆయన ఏ అజెండాతో ముందుకెళ్తారన్నది ఇప్పటికీ తెలియడం లేదు. 2010లో యూపీఏ ప్రభు త్వం కశ్మీర్‌ అంశాన్ని తేల్చేందుకు దిలీప్‌ పద్గోవంకర్, రాధా కుమార్, ఎమ్‌.ఎమ్‌ అన్సారీలతో కూడిన త్రిసభ్య కమిటీని నియమించింది. కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తే సరైనదంటూ ఈ త్రిసభ్య కమిటీ 2012లో కేంద్రానికి నివేదికను సమర్పిచింది. అయితే, ఈ కమిటీ నివేదిక ఇప్పటివరకూ వెలుగుచూడలేదు. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వం బహిర్గత పరచాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top