
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితి(టీజేఎస్)పై మాజీమంత్రి డి.కె.అరుణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీజేఎస్ ఏర్పాటు వల్ల కాంగ్రెస్‌కే లబ్ధి కలుగుతుందని పేర్కొన్నారు. కేసీఆర్‌ను ఓడించడమే కోదండరాం లక్ష్యమైతే ఆయన తమతో కలసి రావాలని ప్రతిపాదించారు. కోదండరాం కేసీఆర్ పెరట్లో మొక్కేనని, ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన విభేదిస్తున్నందున తమతో కలసి రావాలన్నారు.
సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో ఆమె మాట్లాడుతూ వచ్చే జూన్‌లో జోగుళాంబ గద్వాల నుంచి పాదయాత్ర చేస్తానని, ఎక్కడ ముగిస్తానన్నది ఇప్పుడే చెప్పలేనని చెప్పారు. ‘మేం నైరుతి దిశలో ఉన్నాం. తెలంగాణ వాస్తు ప్రకారం ఆ మూలలోనే బలం కావాలి. నైరుతి నుంచి ఈశాన్యానికి పాదయాత్ర చేయాలని అందుకే అనుకున్నా. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్లి వచ్చిన తర్వాత దీని గురించి ఆలోచిస్తా. ఇప్పటికే పాదయాత్ర గురించి హైకమాండ్‌కు చెప్పా’ అని వెల్లడించారు.