ఆర్చ్‌బిషప్‌ లేఖ.. రాజకీయ దుమారం!

Delhi Archbishop letter creates political controversy  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  దేశంలో కల్లోల రాజకీయ వాతావరణం నెలకొందని, ప్రజాస్వామ్యం, లౌకికవాదం ప్రమాదంలో ఉన్నాయంటూ ఢిల్లీ ఆర్చ్‌బిషప్‌ లేఖ రాయడం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ‘దేశం కోసం’  ప్రార్థించాలంటూ క్రైస్తవ మతబోధకులను ఉద్దేశించి ఆయన లేఖ రాశారు. దేశ రాజధాని ఢిల్లీలోని అన్ని చర్చిలను ఉద్దేశించి ఈ నెల 8న ఆర్చ్‌బిషప్‌ అనిల్‌ కౌటో రాసిన ఈ లేఖను బీజేపీ తప్పుబట్టింది. ‘కులం, మతం పేరిట ప్రజలను రెచ్చగొట్టాలనుకోవడం తప్పు. సరైన పార్టీకి, సరైన అభ్యర్థికి ఓటు వేయమని మీరు చెప్పవచ్చు. కానీ ఒక పార్టీకి, ఒక వ్యక్తికి ఓటు వేయకూడదని చెప్తూ మీకు మీరే కుహనా లౌకికవాదిగా అభివర్ణించుకోవడం దురదృష్టకరం’ అని బీజేపీ అధికార ప్రతినిధి షైనా ఎన్సీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ సమ్మిళిత అభివృద్ధి కృషి చేస్తున్నారని, ఏ ఒక్క వర్గంపైనా కేంద్రం వివక్ష చూపడం లేదని, ఈ నేపథ్యంలో అందరూ ప్రగతిశీల సానుకూల దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరముందని కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ అభిప్రాయపడ్డారు.

‘దేశం కోసం’ ప్రార్థనా ప్రచారం చేయాలని, ప్రతివారంలో ఒక రోజు ఉపవాసం ఉండాలని, ప్రతి ఆదివారం సామూహిక ప్రార్థనల సందర్భంగా తప్పకుండా లేఖలో పేర్కొన్న ప్రార్థనను చదివి వినించాలని ఆర్చ్‌బిషప్‌ అనిల్‌ కౌటో తన లేఖలో పేర్కొన్నారు. ‘ప్రస్తుతం రాజకీయ కల్లోల వాతావరణాన్ని చూస్తున్నాం. ఇది మన రాజ్యాంగంలో పేర్కొన్న ప్రజాస్వామిక విలువలు, లౌకిక నిర్మాణానికి ముప్పుగా పరిణమిస్తోంది’ అని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో హుందాతనంతో కూడిన ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని, మన రాజకీయ నాయకుల్లో స్వచ్ఛమైన దేశభక్తి జ్వాల ఎగిసిపడేలా చూడాలని ప్రభువును కోరుతూ ప్రార్థన చేయాలని లేఖలో సూచించారు. అయితే, ఈ లేఖలో ఎలాంటి రాజకీయ ప్రేరేపణ లేదని, ఎన్నికలకు ముందు ఇలా లేఖ రాయడం ఆనవాయితీగా వస్తుందని ఆర్చ్‌బిషప్‌ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top