గజదొంగను ఓడించడానికి దొంగకు మద్దతిస్తే తప్పేంటి?

To defeat BJP, we can support Congress: Hardik Patel - Sakshi

అహ్మదాబాద్‌: బీజేపీ 'గజదొంగ' (మహాచోర్‌).. కాంగ్రెస్‌ 'దొంగ' (చోర్‌).. గజదొంగను ఓడించడానికి దొంగకు మద్దతిస్తే తప్పేంటి అని  పటీదార్‌ ఉద్యమ నాయకుడు హార్థిక్‌ పటేల్‌ ప్రశ్నించారు. పరోక్షంగా కాంగ్రెస్‌ పార్టీకి మద్దతునిస్తానంటూ ఆయన సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అహ్మదాబాద్‌ హోటల్‌లో ఉన్న సమయంలోనే తాను ఆ హోటల్‌కు వెళ్లానని, కానీ తాను రాహుల్‌ను కలువలేదని ఆయన వివరణ ఇచ్చారు.

ఉత్తర గుజరాత్‌లో రోడ్‌షో, బహిరంగ సభల కారణంగా రాహుల్‌గాంధీతో సమావేశానికి వెళ్లలేకపోయానని ఆయన చెప్పుకొచ్చారు. గుజరాత్‌లోని పటీదార్‌ సామాజిక వర్గానికి రిజర్వేషన్‌ కోటా కల్పించాలంటూ హార్థిక్‌ పటేల్‌ ఉధృతంగా ఉద్యమం నిర్వహించడం ద్వారా ప్రముఖంగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌లోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో ఆయన రాహుల్‌గాంధీని రహస్యంగా కలిశారని హోటల్‌ సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఆహ్వానం మేరకు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు తాను హోటల్‌కు వెళ్లానని, అయితే,  ఆలస్యం అవుతుండటంతో తాను అశోక్‌ గెహ్లాట్‌ను మాత్రమే కలిసి వెనుకకు వచ్చానని చెప్పారు. బీజేపీ వాళ్లు హోటల్‌ సీసీటీవీ దృశ్యాలను తెప్పించుకొని.. వాటిని కావాలనే లీక్‌ చేశారని, గుజరాత్‌లో ఉన్నది ప్రతిదీ తమ ఆస్తి అన్నట్టు బీజేపీ తీరు ఉందని ఆయన విమర్శించారు. తానేమీ ప్రధాని నరేంద్రమోదీ లాగా పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ను కలువలేదని హార్థిక్‌ విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top