ఆర్‌ఎస్‌ఎస్‌లో కలకలం ; ప్రవీణ్‌ తొగాడియాపై వేటు?

criticism on Modi govt :RSS likely to axe Praveen Togadia - Sakshi

న్యూఢిల్లీ : వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియాపై మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ తీవ్ర చర్యలకు సిద్ధమైనట్లు తెలిసింది. ‘పోలీసులు నన్ను ఎన్‌కౌంటర్‌ చేయాలని చూస్తున్నారం’టూ ఇటీవల తొగాడియా చేసిన వ్యాఖ్యలు.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టను దిగజార్చడమేకాక బీజేపీ ప్రభుత్వాలను ఇరుకునపెట్టేలా ఉన్నాయని పరివార్‌ పెద్దలు భావిస్తున్నారు. నష్టనివారణ చర్యల్లో భాగంగా తొగాడియాను, అతని అనుకూలురు మరో ఇద్దరిని సంస్థాగత పదవులనుంచి తప్పించనున్నట్లు సమాచారం.

జాతీయ మీడియా కథనాల ప్రకారం.. వేటుకు గురికానున్నవారి జాబితాలో తొగాడియాతోపాటు భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ కార్యదర్శి విర్జేశ్‌ ఉపాధ్యాయ, వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డిల పేర్లు ఉన్నాయి. అయితే సంఘ్‌ పరివార్‌కు చెందిన ఏ సంస్థా అధికారికంగా ఈ విషయాలను నిర్ధారించలేదు. అయితే, తొగాడియా ఆరోపణల అనంతరం పరివార్‌ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిన నేపథ్యంలో ఊహించని మార్పులు తప్పవని ఢిల్లీ, నాగ్‌పూర్‌ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది. పరివార్‌కు సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించే ‘ప్రతినిధి సభ’ జరగడానికి ముందే నిర్ణయాలు వెలువడే అవకాశాలున్నాయి.

మోదీ వర్సెస్‌ తొగాడియా : అజ్ఞాతం నుంచి గత సోమవారం మీడియాముందుకు వచ్చిన ప్రవీణ్‌ తొగాడియా.. తనను పోలీస్ ఎన్‌కౌంటర్‌లో చంపేందుకు కుట్ర జరిగిందని చెప్పుకొచ్చారు. ‘నా నోరు మూయించేందుకు సెంట్రల్ ఏజెన్సీలను మోహరించారు’ అని కన్నీటిపర్యంతమయ్యారు. తొగాడియా ఆరోపణల అనంతరం సంఘ్‌పరివార్‌లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, సంపూర్ణ గోవధ నిషేధం అంశాల్లో మోదీ నిరాసక్తంగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని తొగాడియా గతంలోనూ పలుమార్లు మాట్లాడిన సంగతి తెలిసిందే. మరో కథనం ప్రకారం.. తొగాడియా ఒక పుస్తకాన్ని రాస్తున్నారు. దాదాపు పూర్తికావచ్చిన ఆ పుస్తకంలో మోదీ ప్రతిష్టను దెబ్బతీసే అంశాలున్నట్లు సమాచారం. రామజన్మభూమి ఉద్యమం ద్వారా బీజేపీ ఏ విధంగా రాజకీయ లబ్ధిపొందిందీ, ఏయే నాయకులు ఏ విధంగా లాభపడిందీ తదితర అంశాలు కూడా పొందుపర్చారని తెలిసింది. ఆ పుస్తకం 2019 ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశంఉన్నందున తొగాడియా విషయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఏదోఒక కఠిన నిర్ణయం తీసుకుంటుందని చర్చ జరుగుతోంది. ఇప్పటికైతే ఈ విషయాలేవీ అధికారికంగా వెల్లడికాలేదు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top