
విలేకర్లతో మాట్లాడుతున్న అంబటి రాంబాబు
సాక్షి, అమరావతి బ్యూరో: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు అవకాశం కల్పిస్తామని కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఓటుకు తూటు!’ కథనంపై ఆయన అధికారులతో సమాలోచనలు జరిపారు. గుంటూరు, నరసరావుపేట ఆర్డీవోలతో ప్రత్యేకంగా చర్చించారు. నరసరావుపేటలో పోలింగ్ బూత్‌ల మార్పుపై ఆరా తీశారు. ఐఆర్‌ఇఆర్ సర్వేలో లోపాలు ఉంటే క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. వినుకొండలో ఓటర్ల సంఖ్య తగ్గడంపై కూడా మాట్లాడారు. సత్తెనపల్లిలో ఓట్ల గల్లంతైన విషయంపై సత్తెనపల్లి వీఆర్వో ధనుంజయను హెచ్చరించారు. 14వ తేదీ వరకు సత్తెనపల్లి నుంచి ఓటర్ల చేర్పులు, మార్పులను దగ్గరుండి పరిశీలించాలని ఆదేశించారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాకు సంబంధించిన కొత్త ఓటర్ల జాబితాను మొత్తం ఇవ్వాలని హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.
కలెక్టర్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు
మంగళవారం సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణ జరిపి న్యాయం చేయాలని కలెక్టర్ కోన శశిధర్‌కు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, వైఎస్సార్ సీపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, వినుకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారి రోశయ్యతోపాటు పలువురు ముఖ్యనేతలు వినతిపత్రం అందించారు. నరసరావుపేట పట్టణంలో 21 వేల ఓట్లు ఏ పోలింగ్ బూత్‌లో ఉన్నాయో కనుక్కోవడం కష్టంగా ఉందని కలెక్టర్‌కు వివరించారు. గుంటూరు రోడ్డులో ఓటరును ఊరిచి వర ఉన్న కోటప్పకొండ రోడ్డులో ఉండే పోలింగ్ బూత్‌కు మార్చారని తెలిపారు. సత్తెనపల్లి పట్టణంలోనే 9,630 ఓట్లను తొలగించడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
ఐఆర్‌ఈఆర్ సర్వే పేరుతో ఒక వర్గం వారి ఓట్లను కావాలనే తొలగించారని, అందులో కింది స్థాయి అధికారుల పాత్ర ఉందని చెప్పారు. 9,630 ఓట్లకు సంబంధించి 14వ తేదీలోపు గుర్తించి ఫారం–6 ఇవ్వాలంటే కష్టంగా ఉందని, గడువు పెంచాలని విజ్ఞప్తి చేశారు. వినుకొండ నియోజకవర్గంలో 15 వేల ఓట్లు తొలగించారని బొల్లాబ్రహ్మనాయుడు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బీఎల్వోలు అనుకూలంగా పని చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ నగరంలోని ఓ ఇంట్లో ఆరు ఓట్లు ఉంటే మొత్తం తొలగించారని చెప్పారు. దీనిపై రీసర్వే చేయిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. అనంతరం వైఎస్సార్ సీపీ నేతలు స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై వివరించారు.